ఢిల్లీ క్రైమ్-3
నెట్‌ఫ్లిక్స్: స్ట్రీమింగ్ అవుతున్నది, తారాగణం: షెఫాలీ షా, హ్యుమా ఖురేషి, రసికా దుగ్గల్, రాజేష్ తైలాంగ్, యుక్తి తరేజా తదితరులు, దర్శకత్వం: తనూజ్ చోప్రా
క్రైమ్ థ్రిల్లర్స్‌కు ఓటీటీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే, ఈ జానర్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఒక సీజన్ హిట్ అయితే.. దానికి కొనసాగింపుగా మరో రెండుమూడు విడుదల చేస్తున్నారు. అలా, ప్రేక్షకుల ముందుకు వచ్చిందే.. ‘ఢిల్లీ క్రైమ్’ వెబ్ సిరీస్. ఇండియన్ వెబ్ సిరీస్ ఫార్మాట్‌ని మరో మెట్టు ఎక్కించిన సిరీస్‌గా ఈ ‘ఢిల్లీ క్రైమ్’ నిలిచింది. 2019లో మొదటి సీజన్‌గా ఏడు ఎపిసోడ్స్.. 2022లో రెండో సీజన్‌గా ఐదు ఎపిసోడ్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా, నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆరు ఎపిసోడ్స్‌తో మూడో సీజన్ విడుదలైంది. తనూజ్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ సీజన్.. రికార్డ్ వ్యూస్ దక్కించుకుంటున్నది.
కథలోకి వెళ్తే.. హర్యానా అడ్డాగా, ‘పెద్దక్క’ పేరుతో అక్రమ కార్యకలాపాలు చేస్తుంటుంది మీనా (హ్యూమా ఖురేషి). విజయ్-కుసుమ.. ఆమె ప్రధాన అనుచరులు. వ్యాపారానికి సంబంధించిన ఢిల్లీ వ్యవహారాలను కల్యాణి చూసుకుంటుంది. ఈమె ప్రధాన అనుచరుడిగా రాహుల్ ఉంటాడు. బలహీనమైన కుటుంబ నేపథ్యం ఉన్న అమ్మాయిలే వీరి టార్గెట్. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి.. వాళ్లను ఇతర రాష్ర్టాలకు, వేరే దేశాలకు తరలిస్తూ ఉంటారు. ఇలా ఉండగా.. ఢిల్లీలోని ఒక హాస్పిటల్‌కి ఒక టీనేజర్ వస్తుంది. తీవ్రంగా గాయపడిన ఒక పసిపాపను అక్కడ వదిలేసి పారిపోతుంది. చావు బతుకుల్లో ఉన్న ఆ పాపను రక్షించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తుంటారు.
ఒక పసిపాపను తీవ్రంగా హింసించడం రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారుతుంది. దాంతో ఆ బిడ్డను వదిలి పారిపోయిన టీనేజర్ కోసం ఏసీపీ నీతిసింగ్ (రసిక దుగ్గల్) బృందం గాలిస్తూ ఉంటుంది. అదే సమయంలో మిజోరాం మీదుగా ఆయుధాల అక్రమ రవాణా సాగుతున్నదని అనుమానించిన డీసీపీ వర్తిక చతుర్వేది (షెఫాలి షా) ఓ ట్రక్‌ను తనిఖీ చేస్తుంది. అయితే.. అందులో ఆయుధాలకు బదులుగా పదుల సంఖ్యలో ఆడపిల్లలు కనిపిస్తారు. దాంతో షాక్‌కు గురైన వర్తిక.. ఆ దిశగా విచారణ ప్రారంభిస్తుంది.
ఈ క్రమంలో మరో 40 మంది అమ్మాయిలున్న ట్రక్.. అప్పటికే ఢిల్లీ వెళ్లిందని ఆమెకు తెలుస్తుంది. దాంతో, వారిని కాపాడటానికి ఢిల్లీ వెళ్లి, తన బృందంతో కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది. అలా మొదలైన వర్తిక ఇన్వెస్టిగేషన్.. ఎక్కడి దాకా వెళ్తుంది? ఈ క్రమంలో ఆమెకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? చివరికి ఆ 40 మందిని పోలీసులు కాపాడగలిగారా? హాస్పిటల్‌లోని పసిబిడ్డకు.. అమ్మాయిల అక్రమ రవాణాకు ఉన్న సంబంధమేమిటి? అనేది మిగతా కథ.