‘దంగల్’ సినిమా కోసం ఎన్నో త్యాగాలు చేసినట్లు చెబుతున్నది బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్. ఇష్టంగా పెంచుకున్న జుట్టును కత్తిరించుకున్నాననీ, ఎన్నోరోజులు కడుపు మాడ్చుకున్నానని అంటున్నది. అయితే, ఈ సాహసోపేతమైన నిర్ణయాలే.. తనను బాలీవుడ్లో నిలబెట్టాయని ఆనందం వ్యక్తం చేస్తున్నది. తాజాగా, ఓ యూట్యూబ్ పోడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘దంగల్’ అనుభవాలను పంచుకున్నది.
“జుట్టు అనేది అందం కోసం మాత్రమే కాదు. మహిళలకు సాంస్కృతిక, వ్యక్తిగత ప్రాముఖ్యాన్ని కూడా అందిస్తుంది. అందులోనూ మనదేశంలో పొడవాటి జుట్టును ఇష్టపడే వాళ్లే ఎక్కువ. కాబట్టి, సినిమా కోసం జుట్టును కత్తిరించుకోవడాన్ని సవాల్‌గా స్వీకరించా!” అంటూ చెప్పుకొచ్చింది. దంగల్‌లో పొట్టి జుట్టుతో కనిపించాలని తనకు ముందే చెప్పారట. తను కూడా కొంతకాలంగా చిన్న జుట్టుతో ప్రయోగాలు చేయాలని అనుకున్నదట. దాంతో వెంటనే అంగీకరించానని చెప్పింది. “దంగల్ కంటే ముందు నా జుట్టు చాలా పొడవుగా ఉండేది. అయితే, కనీసం ఒక్కసారైనా చిన్న జుట్టుతో తెరపై కనిపించాలని అనుకునేదాన్ని. దాంతో వెంటనే ఓకే చెప్పా! అంతేకాదు.. దంగల్ సినిమా నా కెరీర్‌కు కీలకమైన మలుపు.
డబ్బుతోపాటు స్టార్డమ్ కూడా తీసుకొచ్చింది” అంటూ పంచుకున్నది. అదే సమయంలో తాను ‘బులిమియా’ అనే వ్యాధితో బాధపడినట్లు వెల్లడించింది. అతిగా తినే అలవాటు, ఆకలితో అలమటించడం వంటి సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. అలా ఒక ఏడాది పాటు ఈ సమస్యతో పోరాడానని తెలిపింది. ఆమిర్‌ఖాన్ ప్రధానపాత్రలో.. హర్యానాకు చెందిన వెటరన్ రెజ్లింగ్ చాంపియన్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది ‘దంగల్’.
ఈ చిత్రంలో ఫాతిమా భారత స్టార్ రెజ్లర్ గీత ఫోగట్‌గా కనిపించింది. ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. ‘ఇష్క్’ సినిమాలో బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఫాతిమా.. ‘నువ్వు నేను ఒకటవుదాం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులనూ పలకరించింది. 2023లో వచ్చిన శ్యామ్ బహదూర్ చిత్రంలో ఇందిరాగాంధీ పాత్రలో ఆకట్టుకున్నది. త్వరలోనే రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘గుస్తాక్ ఇష్క్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇందులో విజయ్ వర్మ సరసన రొమాన్స్ చేయనున్నది.