CM Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 8(నమసస్తే తెలంగాణ): పుట్టిన రోజు వేళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జునఖర్గే నుంచి శుభాకాంక్షలు అందకపోవడం చర్చనీయాంశమైంది. సాయంత్రం వరకు ఎదురుచూసినా వారి నుంచి బర్త్‌డే విషెస్ అందకపోవడంతో సీఎం నిరాశ చెందినట్టు తెలిసింది. రేవంత్‌ను అధిష్ఠానం దూరం పెడుతున్నదన్న వార్తలకు ఇది మరింత బలం చేకూర్చింది. అంతేకాదు, ముఖ్యమంత్రి మార్పు ఇక లాంఛనమేనన్న ప్రచారం కూడా జరుగుతున్నది. రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు చెప్పిన వారి పేర్లను సీఎంవో కార్యాలయం అధికారిక సోషల్ మీడియా గ్రూప్‌లో పోస్టు చేసింది. ఆ పేర్లలో అధిష్ఠానం పెద్దల పేర్లు కనిపించలేదు. రేవంత్‌రెడ్డి రాజకీయ మార్గదర్శి కేసీ వేణుగోపాల్ కూడా జన్మదిన శుభకాంక్షలు తెలపకపోవడం గమనార్హం.
ఏడుసార్లు ఢిల్లీకి వెళ్లి ప్రాధేయపడినా రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదని, ప్రియాంకగాంధీ నామినేషన్ కార్యక్రమానికి వయనాడ్ వెళ్లినప్పటికీ అక్కడ ఆమె కూడా పలకరించలేదని, త్వరలోనే ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తాజా ఘటన బలం ఇచ్చినట్టు అయిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. అదే సమయంలో ఢిల్లీ బీజేపీ ఆయనను దగ్గరకు తీస్తున్నదని, రేవంత్ కోరినప్పుడల్లా ప్రధాని మోదీ, నడ్డా, అమిత్‌షా వంటి కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయని పార్టీలోని కొందరు నేతలు చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రేవంత్‌కు మోదీ ఉదయం 8:30 గంటలకే శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, సినీ నటుడు చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లోర్సన్ తదితరులు ఉన్నారు. మరోవైపు, రేవంత్‌రెడ్డికి అధిష్ఠానం పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదన్న విష యం సోషల్ మీడియాకెక్కి విపరీతంగా ట్రోల్ కావడంతో రేవంత్ స్వయంగా నష్టనివారణ చర్యలు చేపట్టారు. రాత్రి 10 గంటలకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. సమయం తీసుకుని మరీ తనకు వ్యక్తిగతంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినందుకు రాహుల్ భయ్యాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకొంటున్నట్టు రేవంత్ ఆ పోస్టులో పేర్కొన్నారు.