113/6. 210 పరుగుల కొండంత లక్ష్య ఛేదనలో 13 ఓవర్లకు ఢిల్లీ స్కోరిది. ప్రధాన ఆటగాళ్లంతా పెవిలియన్ చేరగా క్రీజులో అశుతోష్ శర్మ ఒక్కడే బ్యాటర్. కానీ విప్రజ్ నిగమ్ అండగా విశాఖ తీరాన అశుతోష్ అద్భుతమే చేశాడు. గత సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు చిరస్మరణీయ విజయాలు అందించిన ఈ మధ్యప్రదేశ్ కుర్రాడు.. తాజా సీజన్లో ఢిల్లీ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే ‘మ్యాచ్ విన్నింగ్’ ఇన్నింగ్స్ ఆడాడు. దొరికిన బంతిని దొరికట్టుగా బౌండరీ లైన్ అవతలకు పంపించిన అతడు చివరిదాకా క్రీజులో నిలిచి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ క్యాపిటల్స్‌కు ఉత్కంఠ విజయాన్ని అందించాడు.
Ashutosh Sharma | విశాఖపట్నం: ఐపీఎల్ -18వ సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీతో ఆరంభించింది. సోమవారం విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో రసవత్తరంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ.. లక్నోపై ఒక వికెట్ తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. లక్నో నిర్దేశించిన 210 పరుగుల ఛేదనను ఢిల్లీ.. మరో మూడు బంతులు మిగిలుండగానే 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అశుతోష్ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు విప్రజ్ నిగమ్ (15 బంతుల్లో 39, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (22 బంతుల్లో 34, 1 ఫోర్, 3 సిక్సర్లు) పోరాటం ఆ జట్టును విజయపథాన నిలిపింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (30 బంతుల్లో 75, 6 ఫోర్లు, 7 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 72, 6 ఫోర్లు, 6 సిక్సర్లు) దంచికొట్టినా బౌలర్ల వైఫల్యంతో ఆ జట్టు ఓటమి వైపు నిలవక తప్పలేదు. అశుతోష్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
భారీ ఛేదనలో ఢిల్లీ ఆరంభంలోనే చేతులెత్తేసి 15 ఓవర్ దాకా అసలు రేసులోనే లేదు. తొలి రెండు ఓవర్లకే ఆ జట్టు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (1), అభిషేక్ పొరెల్(0), సమీర్ రిజ్వి(4) వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కెప్టెన్ అక్షర్ (22)తో కలిసి డుప్లెసిస్ (29) ఆదుకునే యత్నం చేశాడు. కానీ వరుస ఓవర్లలో అక్షర్, డుప్లెసిస్ నిష్క్రమణతో ఆ జట్టు పోరాటం మళ్లీ మొదటికొచ్చింది. స్టబ్స్, అశుతోష్ ఆరో వికెట్‌కు 48 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే స్టబ్స్‌ను 13వ ఓవర్లో సిద్ధార్థ్ బౌల్డ్ చేశాడు. ఢిల్లీ విజయానికి ఆఖరి 7 ఓవర్లలో 93 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులోకి వచ్చిన విప్రజ్.. అశుతోష్‌తో కలిసి లక్నోను భయపెట్టాడు. బిష్ణోయ్ 14వ ఓవర్లో రెండు బౌండరీలు ఓ భారీ సిక్సర్ బాదాడు. ప్రిన్స్ యాదవ్ 16వ ఓవర్లో అశుతోష్ 6,4 కొట్టగా విప్రజ్ కూడా రెండు ఫోర్లు సాధించడంతో ఢిల్లీ రేసులోకి వచ్చింది. కానీ దిగ్వేష్ 17వ ఓవర్లో విప్రజ్ ఔట్ అయినా ఆఖర్లో అశుతోష్ పోరాటం ఆ జట్టును విజయతీరాలకు చేర్చింది.
లక్నో ఇన్నింగ్స్‌లో మార్ష్, పూరన్ ఆటే హైలైట్. ఆ జట్టు 209 పరుగులు చేస్తే అందులో ఈ ఇద్దరివే 147. పవర్ ప్లేలో మార్ష్ వీరవిహారం చేస్తే మిడిల్ ఓవర్స్‌లో పూరన్ పూనకమొచ్చినట్టు ఆడాడు. ఈ సీజన్లో లక్నో తరఫున ప్యూర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన మార్ష్.. అందుకు తగ్గట్టుగానే విజృంభించాడు. ఎదుర్కున్న తొలి బంతినే డీప్ స్కేర్ లెగ్ మీదుగా భారీ సిక్సర్‌తో అతడి విధ్వంసం మొదలైంది. స్టార్క్ మూడో ఓవర్లో 4, 6, 4 బాదిన అతడు.. 21 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. మార్క్మ్ (15) నిరాశపరిచినా రెండో స్థానంలో పూరన్ రాకతో లక్నో స్కోరు వేగానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది.
విప్రజ్ నిగమ్ 7వ ఓవర్లో పూరన్ మూడు భారీ సిక్సర్లు కొట్టాడు. 17 పరుగుల వద్ద సమీర్ రిజ్వి క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన పూరన్ ఆ అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు. వీళ్లిద్దరి దూకుడుతో లక్నో 9 ఓవర్లకే 100 పరుగుల మార్కును దాటింది. 12వ ఓవర్లో ముకేశ్ ఎట్టకేలకు మార్ష్‌ను ఔట్ చేయడంతో ఢిల్లీ ఊపిరి పీల్చుకుంది. కానీ ఢిల్లీకి ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. స్టబ్స్ 13వ ఓవర్లో పూరన్.. 6, 6, 6, 6, 4తో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. పంత్ డకౌట్ అవగా స్టార్క్ 15వ ఓవర్లో పూరన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్ (27 నాటౌట్) లక్నో స్కోరును 200 దాటించాడు.
లక్నో: 20 ఓవర్లలో 209/8 (పూరన్ 75, మార్ష్ 72, స్టార్క్ 3/42, కుల్దీప్ 2/20);
ఢిల్లీ: 19.3 ఓవర్లలో 211/9 (అశుతోష్ 66 నాటౌట్, విప్రజ్ 39, శార్దూల్ 2/19, దిగ్వేశ్ 2/31)