ఇస్లామాబాద్, ఏప్రిల్ 15: అవిశ్వాస తీర్మానంలో ఓడి పదవి కోల్పోయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) ప్రధాని సర్దార్ అబ్దుల్ ఖయ్యుం నైజీ గురువారం రాజీనామా చేశారు. పీటీఐ పార్టీలో నెలకొన్న తిరుగుబాటు నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నది. ఇమ్రాన్ వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్న అబ్దుల్ ఖయ్యుంను దించేందుకు సొంత పార్టీకే చెందిన 25 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ప్రధాని కుర్చీలో పీటీఐ ప్రాంతీయ అధ్యక్షుడు సర్దార్ తన్వీర్‌ను కూర్చొబెట్టాలనేది తిరుగుబాటు వర్గం ప్లాన్. ఖయ్యుం రాజీనామాను పీవోకే అధ్యక్షుడు సుల్తాన్ మహ్మద్ ఆమోదించినట్టు అధ్యక్ష వ్యవహారాల కార్యదర్శి అసిఫ్ హుస్సేన్‌షా ధ్రువీకరించారు.
ఖరాన్ నగరంలోని పాకిస్థాన్ నిఘా కార్యాలయాలపై బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు రాకెట్ దాడులు చేశారు. ఈ ఘటనల్లో పలువురు మృతిచెందినట్టు సమాచారం. నసీరాబాద్ జిల్లాలో మురాద్ జమలి ఏరియాలోని ఓ గ్యాస్ పైప్‌లైన్‌ను మరో బలూచ్ సాయుధ గ్రూప్ బీఆర్జీ పేల్చేసింది. మరోవైపు బలూచిస్థాన్ ప్రవాస ప్రభుత్వాన్ని మార్చి 21న ఏర్పాటు చేసినట్టు బలూచిస్థాన్ స్వాతంత్య్ర ఉద్యమ నాయకురాలు నీలా క్వాద్రి శుక్రవారం పేర్కొన్నారు. పాక్ నుంచి బహిష్కరణకు గురైన ఆమె ప్రస్తుతం కెనడాలో ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వానికి సంబంధించి కచ్చితమైన భౌగోళిక స్థానాన్ని వెల్లడించలేమన్నారు. ఉత్తర వజీరిస్థాన్‌లో రెండు తీవ్రవాద దాడుల్లో ఎనిమిది పాక్ సైనికులు మరణించారు.