న్యూఢిల్లీ: మానవ మెదడు కణాలతో కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను తయారు చేసే రోజులు రాబోతున్నాయి. డీఎన్ఏ, ప్రొటీన్లు లేదా సజీవ టిష్యూ (ప్రయోగశాలలో పెంచిన న్యూరాన్లు) ఈ బయో కంప్యూటర్లో కంప్యుటేషనల్ టాస్క్స్‌ను నిర్వహిస్తాయి. ఈ ప్రక్రియలో న్యూరాన్లను వృద్ధి చేయడం, వాటిని ఆర్గనాయిడ్స్‌గా పిలిచే చిన్న క్లస్టర్లుగా అభివృద్ధి చేయడం, ఆ తర్వాత ఈ క్లస్టర్లను ఎలక్ట్రోడ్స్‌కు అనుసంధానం చేయడం ఉంటాయి. అనంతరం వాటిని చిన్న కంప్యూటర్లుగా వాడుకోవచ్చు. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే, ఈ బయోకంప్యూటర్లు సంప్రదాయ కంప్యూటర్ల కన్నా తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటాయి.
ప్రస్తుతం ఈ బయోకంప్యూటర్లు తేలికపాటి కార్యకలాపాలను మాత్రమే నిర్వహించగలుగుతున్నాయి. 2022లో ఆస్ట్రేలియన్ కంపెనీ కార్టికల్ ల్యాబ్స్ విజయవంతంగా ఆర్టిఫిషియల్ న్యూరాన్ల చేత క్లాసిక్ కంప్యూటర్ గేమ్ పోంగ్ను ఆడించింది. మరో ఉదాహరణ, బ్రెయినోవేర్ బయోకంప్యూటింగ్ సిస్టమ్. ఇది సజీవ మెదడు కణాలను కంప్యూటర్‌కు అనుసంధానం చేసింది. ఫలితంగా బేసిక్ స్పీచ్ రికగ్నిషన్‌ను సాధించింది. బ్రెయిలీ అక్షరాలను గుర్తించేందుకు న్యూరాన్లతో కూడిన మానవ మెదడు ఆర్గనాయిడ్స్‌ను విజయవంతంగా ఉపయోగించినట్లు ఆగస్టులో బ్రిస్టల్ విశ్వవిద్యాలయం బృందం ప్రకటించింది. మానవ న్యూరాన్లను వృద్ధి చేయడం, వాటిని బయలాజికల్ ట్రాన్సిస్టర్లతో పోల్చదగిన ఫంక్షనల్ సిస్టమ్స్‌గా మార్చడంపై చాలా అకడమిక్, కమర్షియల్ ల్యాబ్స్ ప్రస్తుతం దృష్టి సారించాయి.