హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దళిత సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నదని దళిత హకుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) తెలంగాణ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లో సీపీఐ అనుబంధ విభాగం డీహెచ్‌పీఎస్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మారుపాక అనిల్‌కుమార్ మాట్లాడుతూ దళితుల అభివృద్ధికి ఉద్దేశించిన ఎస్సీసబ్ ప్లాన్ నిధులు ఇతర అవసరాలకు మళ్లించడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికీ వేల మంది దళితులు సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారని, వీరందరికీ ప్రభుత్వం శాశ్వత నివాసం కల్పించాలని సూచించారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం వచ్చేనెల 3న కలెక్టరేట్లను ముట్టడించనున్నట్టు వెల్లడించారు.
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : ఉద్యాన విద్య, పరిశోధన, సుస్థిర అభివృద్ధి కోసం అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయం, ప్రపంచబ్యాంకుతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలంగాణ ఉద్యాన వర్సిటీ తెలిపింది. ఈ మేరకు గురువారం ఫ్లోరిడా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ విజయగోపాల్ కకాని, ప్రపంచ బ్యాంకు ఫుడ్, అగ్రికల్చర్ గ్లోబల్ ప్రాక్టీస్ సీనియర్ అగ్రిబిజినెస్ స్పెషలిస్ట్ ఆదర్శ్కుమార్తో వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ డీ రాజిరెడ్డి మాట్లాడారు. ఉద్యాన రంగంలో విద్యా నైపుణ్యం, కొత్త విషరణలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ తదితర విషయాల్లో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఫ్లోరిడా విశ్వవిద్యాలయం, ఉద్యాన వర్సిటీ మధ్య సహకారానికి ఉన్న అవకాశాలను ప్రొఫెసర్ డాక్టర్ విజయగోపాల్ వివరించారు. ఉద్యాన అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు సహకారంపై ఆదర్శ్‌కుమార్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. సమావేశంలో ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్‌బాషా, రిజిస్ట్రార్ డాక్టర్ భగవాన్, అంతర్జాతీయ కార్యక్రమాల విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసన్, ప్రణాళిక, పర్యవేక్షణ విభాగం డైరెక్టర్ డాక్టర్ అనితాకుమారి, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.