రాష్ట్ర హైకోర్టు ప్రకటన
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించి ఆస్తు లు కూడబెట్టారన్న అభియోగాలతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసులను గురువారం నుంచి రోజువారీగా విచారిస్తామని తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. ఇప్పటికే ఈ కేసుల విచారణ ఆలస్యమైందని, ఇలాం టి కేసులపై విచారణ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు పేర్కొన్నదని హైకోర్టు గుర్తుచేస్తూ.. పిటిషనర్లు కోరినట్టుగా వారం రోజుల తర్వాత విచారణ చేపట్టేందుకు నిరాకరించింది. జగన్ అక్రమాస్తుల వ్య వహారంలో తమపై అన్యాయంగా నమో దు చేసిన కేసులను కొట్టేయాలంటూ హెటిరో, అరబిందో ఫార్మా కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ షమీమ్ అక్తర్ బుధవారం విచారణ జరిపారు. కింది కోర్టు జరిపే విచారణపై రెండు వారాలపాటు స్టే పొడిగించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి తిరసరిస్తూ.. గురువారం వరకే స్టే అమల్లో ఉంటుందని గుర్తుచేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో హెటిరో, అరబిందో ఫార్మా సంస్థలకు భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని, దీనికి ప్రతిఫలంగా ఆ సంస్థలు వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయని సీబీఐ నమోదు చేసిన కేసులను గురువారం నుంచి రోజువారీగా విచారిస్తామని జస్టిస్ షమీమ్ అక్టర్ స్పష్టం చేశారు.