
సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో భారీ మోసాలకు పాల్పడిన సంధ్య కన్వెన్షన్ ఎండీ సర్నాల శ్రీధర్‌రావుపై మరింత మంది బాధితులు గురువారం ఫిర్యాదు చేశారు. దీంతో సైబరాబాద్‌లోని మియాపూర్, గచ్చిబౌలి, నార్సింగి పోలీస్స్టేషన్లలో తాజాగా మూడు కేసులు నమోదయ్యాయి. పొలాలు, ప్లాట్లు, వాణిజ్య స్థలాల విక్రయం, కాంట్రాక్టు పనులు అంటూ పలువురి వద్ద నుంచి డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే. 2015 తరువాత మోసానికి గురైన బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బుధవారం రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో, ఇతడి మోసాలు బయటకు వచ్చాయి.
ఇతడి చేతిలో పలువురు వ్యాపారులు, రాజకీయ నాయకులు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారు సైతం మోసపోయినట్లు కొందరు బాధితులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇతడిపై గతంలో మూడు కేసులు నమోదయ్యాయి. అందులో ఒక దాంట్లో రాజీకుదర్చుకున్నాడు. ఒకే ఆస్తిని నలుగురైదుగురికి విక్రయిస్తూ శ్రీధర్‌రావు గత కొన్నేళ్లుగా మోసాలకు పాల్పడుతున్నాడు. అలా డబ్బులిచ్చిన వారిలో బలం ఉన్నవాళ్లు ఒత్తిడి చేస్తే కొన్ని సందర్భాల్లో డబ్బులు తిరిగి ఇవ్వడం, లేదంటే ఆ స్థలంలో కొంత రిజిస్ట్రేషన్ చేయడం చేస్తుంటాడు. మిగతా వాళ్లు ఒత్తిడి చేస్తే అది సివిల్ వ్యవహారమంటూ దాటవేస్తూ వస్తుంటాడు. డబ్బులిచ్చిన వారు కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగితే డబ్బులు ఎప్పుడొస్తాయోననే భయంతో చట్టప్రకారం ముందుకు వెళ్లడానికి ముందుకు రావడం లేదని కొంత మంది బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. జుబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఫిర్యాదు చేయకుండా వెను తిరిగాడు. శ్రీధర్‌రావు బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు బాధితులకు భరోసా ఇస్తున్నారు.
రూ.11.50 కోట్లు మోసం
రాయదుర్గంలోని సంధ్య టెక్నోవన్ వాణిజ్య సముదాయంలో ఐటీ కార్యాలయం ఏర్పాటుకోసం 2018లో 26వేల చదరపు అడుగుల స్థలం కొనుగోలుకు ఒప్పదం చేసుకున్నాం. సర్నాల శ్రీధర్ రావు ఇందుకోసం రూ.11కోట్ల 50లక్షలు తీసుకున్నాడు. రెండున్నరేండ్లు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ చేయడం లేదు. నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో చేసేది లేక ఇటీవల సైబరాబాద్ పోలీసులను అశ్రయించి ఫిర్యాదు చేశా.
రూ.3.10 కోట్లు ఎగ్గొట్టాడు
సంధ్య శ్రీధర్‌రావు దగ్గర 2018 నుంచి ఎర్త్ వర్క్ పనులు చేస్తూవచ్చాను. రాయదుర్గం సంధ్య టెక్నోవన్ వాణిజ్య సముదాయం, నానక్‌రాంగూడ, గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్, బెంగళూర్‌లోని వైట్‌ఫీల్డ్ ప్రాంతాల్లో నిర్మాణ పనులు పూర్తిచేశాం. గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ పనులకు రూ.3.55 కోట్లు ఒప్పదం కుదుర్చుకుని కేవలం రూ.1.90 కోట్లు మాత్రమే ఇచ్చాడు. ఇలా పలు ప్రాంతాల్లో పనులు చేయించుకుని రూ.3.10 కోట్ల వరకు ఎగ్గొట్టాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
రూ.2 కోట్లు తీసుకుని భవనం ఇవ్వలేదు
2018 మే నెలలో రాయదుర్గం సంధ్య టెక్నోవన్ భవనంలో శ్రీధర్‌రావు దగ్గర 2వేల చదరపు అడుగుల స్థలం కొనడానికి అగ్రిమెంట్ చేసుకున్నా. ఆరు నెలల్లో భవనం పూర్తిచేసి ఇస్తానని చెప్పి రూ.2 కోట్లు అదే సంవత్సరం సెప్టెంబర్ నెలలో తీసుకున్నాడు. ఇప్పటివరకు భవనం ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వడం లేదు. రిటైర్డ్ మెంట్ డబ్బులు, వ్యవసాయ భూమి అమ్మిన డబ్బులు మొత్తం పోయాయి.