మంచి ఉద్యోగాలు దొరకడం ఎప్పుడూ కష్టమే. అనుకోకుండా ఉన్నతోద్యోగం మీ తలుపు తడితే.. అదృష్టం పట్టిందని ఎగిరి గంతేయకండి. అర్హతకు మించిన కొలువు వచ్చిందని సంబురాలూ చేసుకోకండి. ఏమో ఎవరికి తెలుసు? అది సైబర్ మోసగాళ్లు పన్నిన వల కావచ్చు. ఫేక్ జాబ్ ఉచ్చులో చిక్కుకొని మోసపోయినవారు ఎందరో ఉన్నారు. ఆ జాబితాలో మీరూ ఉండకూడదంటే.. ఈ సూచనలు గమనించండి.
ఆన్లైన్ జాబ్ పోర్టల్‌లో మీ రెజ్యూమే చూశామని, వెంటనే ఉద్యోగం ఇస్తామని, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నామనీ నమ్మకంగా చెబుతారు స్కామర్లు. కొన్నిసార్లు వెతకబోయిన తీగ దొరికిందన్నట్టుగా బురిడీ కొట్టిస్తారు. ఉద్యోగం కోసం ఫైనలిస్టులను ఇంటర్వ్యూ చేస్తున్నామని చెప్పి మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. ఆ మాయమాటలను గుడ్డిగా నమ్మితే ఉద్యోగం వచ్చే మాట అటుంచితే, ఉన్న కాస్త సొత్త్తూ మాయమయ్యే ప్రమాదం ఉంది. స్కామర్ల తెలివిమీరినతనాన్ని ఇట్టే కనిపెట్టేయొచ్చు.
ఉదాహరణకు.. స్కామర్లు పంపే మెయిల్, వెబ్ లింకుల్లో చిన్నచిన్న దోషాలు ఉంటాయి. అఫీషియల్ మెయిల్స్‌లో కూడా వ్యాకరణ దోషాలు దొర్లుతాయి. మీకు పంపిన మెయిల్లో కాంటాక్ట్ నెంబర్ లేదంటే అది మోసపూరితమైనదనే అంచనాకు రావచ్చు. కొన్ని స్కామ్ మెయిల్స్ అసలైన సంస్థల నుంచి వచ్చినట్లుగా కనిపిస్తాయి. కాకపోతే, మెయిల్ ఐడీ తప్పుగా ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి మెయిల్ వచ్చిందనుకోండి. jobs@bankofamerica.com అనే లింక్ నుంచి రావాలి. కానీ స్కామర్లు పంపే చిరునామా jobs@bankof-america.com అని ఉంటుంది. ఇదిగో.. ఈ చిన్న తేడాను గమనించకుండా బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగం వచ్చిందని భ్రమపడిపోయి.. ఆ మెయిల్లో పేర్కొన్న ప్రకారం అన్ని వివరాలూ పంపుతూపోతే మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ అవడం ఖాయం.
కొందరు స్కామర్లు అసలైన సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు నటిస్తారు. గోప్యమైన సమాచారాన్ని అందించాలని అడుగుతారు. ఆధార్ వంటి వ్యక్తిగత సమాచారాన్నీ లాగేసుకుంటారు. బ్యాక్‌గ్రౌండ్ చెక్ ముసుగులో పాన్, పాస్‌పోర్ట్ కాపీలు పంపమని చెబుతారు. అడిగారు కదా అని పంపితే భవిష్యత్తులో ఫిషింగ్ దాడులకు గురయ్యే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం.. మనకు ఉద్యోగం ఇచ్చేవాడు డబ్బు పంపమని ఎన్నటికీ అడగడు. ఎవరైనా అలా అడిగారంటే ఏదో తేడా ఉన్నట్టే! రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలని, సర్వీస్ ఫీజు కట్టాలని ఎవరైనా ఒత్తిడి చేసినా గుడ్డిగా నమ్మి మోసపోకండి. ఆ వంచనలు రకరకాలు..
వ్యక్తులు, సంస్థలు అనధికారిక మార్గాల ద్వారా ఉద్యోగ నియామకాలు లేదా ఉపాధి అవకాశాలను వాగ్దానం చేసే మోసపూరిత కుట్రను సూచిస్తుంది. ఇలాంటి కుంభకోణాలు తరచూ ఉద్యోగార్థుల ఆశను సొమ్ముచేసుకుంటాయి. ఇవన్నీ చట్టవిరుద్ధమైనవి, అనైతికమైనవి, హానికరమైనవి. పొరపాటున డబ్బు చెల్లిస్తే ఆ తరువాత ఆ సంస్థ గానీ, దానికి సంబంధించిన ప్రతినిధులు కానీ మళ్లీ కనిపించరు.
ముందుగా మీకు ఉద్యోగం వచ్చిందని ఫోన్ వస్తుంది. ఆనందంలో ఉండగానే మెరుగైన ప్యాకేజీ ఇచ్చినందుకు ఇంత పర్సంటేజ్ చెల్లించాలని స్కామర్లు అడుగుతారు. ఆఫర్ లెటర్ వచ్చాకే డబ్బు చెల్లించమని కోరుతారు. అన్నట్టుగానే ఆఫర్ లెటర్ పంపిస్తారు. మనం డబ్బులు చెల్లిస్తాం. తర్వాత కానీ, అది నకిలీ అని తెలియదు. మరి కొందరు జాదూగాళ్లు.. ఆఫర్ లెటర్ షేర్ చేసిన తర్వాత యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించాలని, లేనిపక్షంలో ఆఫర్ రద్దవుతుందని హెచ్చరిస్తారు. స్కామర్లు కమ్యూనికేట్ చేసే డొమైన్ ఒరిజినల్‌ను పోలి ఉంటుంది. ఉదాహరణకు.. www.amazan.com బదులుగా www.amazon.com కనిపిస్తుంది. వీటిల్లో a, o తేడా గమనించకపోతే మోసపోవడం ఖాయం.
ఇది మరో తెలివైన మోసం. ముందుగా ‘మీ ప్రొఫైల్ లీగల్ డిపార్ట్మెంట్కు ఫార్వర్డ్ చేయబడింది’ అని
మీకు సంక్షిప్త సందేశం వస్తుంది. ‘వచ్చే ఏడు సంవత్సరాల వరకు మీరు ఏ ఎంఎన్సీ కంపెనీకీ దరఖాస్తు చేయలేరు’ అని కోర్టు నుంచి వచ్చినట్టుగా లీగల్ నోటీసు, చలానా పంపిస్తారు స్కామర్లు. ఫలానా చలానా రుసుమును రెండు గంటల్లోగా కోర్టులో చెల్లించాలని అందులో ఉంటుంది. ఫీజు చెల్లించకపోతే చర్యలు తప్పవంటూ బెదిరింపులకు పాల్పడతారు. చలానా కట్టకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయంతో డబ్బు చెల్లించడానికి సిద్ధమవుతారు. ఇదే అదునుగా బాధితుడికి ఫలానా అధికారిక ఏజెంట్‌ని అంటూ.. కాల్ చేస్తారు. కోర్టుకు చెల్లించకుండా తమకే ఆ మొత్తం చెల్లించాలనీ, తామైతే నకిలీ డేటా అంతా తొలగించగలమని నమ్మిస్తారు. విపత్కర పరిస్థితుల్లో చాలామంది బాధితులు నకిలీ ఏజెంట్లకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఇలా రకరకాల మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అప్రమత్తంగా ఉండకపోతే నిండా మునుగుతారు.