టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీకి పర్యవేక్షణ బాధ్యతలు
త్వరలో ఇంజినీర్లు, ఎస్ఎంసీలకు శిక్షణ
ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించనున్న టాటా కన్సల్టెన్సీ సంస్థ
హైదరాబాద్, ఫిబ్రవరి 27: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమగ్రంగా మార్చే ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ పథకం అమలు, పర్యవేక్షణ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమ వసతుల అభివృద్ధి కార్పొరేషన్(టీఎస్ఈడబ్ల్యూఐడీసీ)కు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు అప్పగించారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 10 మంది ఈఈలను జిల్లా కో ఆర్డినేటర్లుగా నియమించారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకొని అత్యధిక ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలను ఈ పథకం కోసం ఎంపిక చేశారు. ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ఇంజినీరింగ్ విభాగం చొప్పున మొత్తం పది శాఖలకు భాగస్వామ్యం కల్పించారు. ఆయా విభాగాలన్నింటినీ టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీకి చెందిన ఈఈలు సమన్వయం చేయనున్నారు. జిల్లా కోఆర్డినేటర్లు తమ జిల్లాలో పథకాన్ని పకడ్బందీగా అమలుచేయడం, ఇతర శాఖలతో సమన్వయం, అన్ని రకాల పనుల్లో నాణ్యతను తనిఖీచేయడం, టీసీఎస్ మాడ్యూల్లో ఎప్పటికప్పుడు డాటాను నిక్షిప్తంచేయడం, అవసరాల మేరకు క్షేత్రస్థాయి అంచనాలను రూపొందించడం తదితర బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. పథకం విధివిధానాలపై రాష్ట్రస్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. అంచనాలను రూపొందించడం, అనుమతులివ్వడం, నిధులు మంజూరు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. త్వరలో జిల్లాలవారీగా 10 విభాగాల ఇంజినీర్లు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)లకు శిక్షణ ఇవ్వనున్నారు.
ప్రత్యేక సాఫ్ట్వేర్
మన ఊరు-మన బడి పథకానికి సంబంధించిన అనుమతుల మంజూరు, పర్యవేక్షణ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసే బాధ్యతను టాటా కన్సల్టెన్సీ సంస్థ(టీసీఎస్)కు అప్పగించారు. ప్రస్తుతం అంచనాలు రూపొందించే పనులు జరుగుతున్నాయి. సాఫ్ట్వేర్ అందుబాటులోకి రాగానే, అనుమతులు మంజూరుచేసి, పనులు ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు.