నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడతామంటూ రంగుల కలలు చూపించిన పాలకులు.. ఆచరణలో చేతులెత్తేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్ సిటీ) ప్రాజెక్టులు భూ సేకరణ ముసుగులో ఒకొకటిగా రద్దు చేస్తున్నారు. ‘మా దగ్గర పైసల్లేవు.. ప్రభుత్వం రూపాయి విదిల్చదు’ అంటూ బల్దియా అధికారులు చేతులెత్తేస్తుండటంతో హెచ్ సిటీ ప్రాజెక్టులు ప్రశ్నార్థకంగా మారాయి. టీడీఆర్‌లు (బదిలీ చేయగల అభివృద్ధి హకులు) ఇస్తామంటే బాధితులు ససేమిరా అంటుండగా, నగదు పరిహారం ఇచ్చే ధైర్యం లేక సరారు నాన్చుడు ధోరణి అవలంభిస్తుండడంతో రూ.వందల కోట్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమవుతుండగా, నిత్యం నరకం చూస్తున్న నగరవాసికి మాత్రం ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు.
– సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ)
కేబీఆర్ పార్క్ చుట్టూ రూ.1090కోట్లతో 7ఫ్లైఓవర్లు, 7అడర్పాస్లు నిర్మిస్తున్నామంటూ చేపట్టిన ప్రాజెక్టును రద్దు చేస్తూ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు తమ ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకమని గొప్పలు చెప్పుకున్న రేవంత్‌రెడ్డి స్వయంగా అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజాప్రయోజనాలకు తిలోదకాలిచ్చారు. శనివారం పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ అధ్యక్షతన జరిగిన జీహెచ్ఎంసీ స్టాడింగ్ కమిటీ సమావేశంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రతిపాదిత ఏడు చోట్ల స్టీల్ బ్రిడ్జిలు, అండర్‌పాసులు నిర్మించాలన్న ప్రతిపాదనలు రద్దు చేస్తూ నిర్ణయించారు.
ఈ సమావేశంలో మొత్తం 11 అంశాలకు ఆమోదం లభించగా అందులో నగర మౌలిక వసతులు, ఫ్లై ఓవర్లు, రోడ్ల అభివృద్ధి, పార్కుల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సంవత్సరం ఆగస్టు 8నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ హెచ్సిటీ ప్రాజెక్టు నిర్మాణ పనుల వల్ల వాహనాల రాకపోకల సమస్య వస్తుందన్న ఉద్దేశంతో వన్‌వే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. తెరపైకి వన్‌వే విధానం విజయవంతం అని చెప్పుకుంటూనే తెరవెనక మాజీ మంత్రి జానారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత చంద్రశేఖర్‌రెడ్డి, రేణుకాచౌదరిలాంటి ప్రముఖుల నుంచి తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో రద్దు నిర్ణయానికి సీఎం తలొగ్గినట్ల్లు తెలిసింది. ఈ ప్రాజెక్టును రద్దు చేసినందుకు బదులుగా పంజాగుట్ట ఎన్ఎఫ్సీఎల్ కూడలి నుంచి జూబ్లీచెక్‌పోస్టు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 2: (నమస్తే తెలంగాణ) :నగర మౌలిక వసతుల కల్పన, విశ్వనగర ప్రగతి ప్రయాణానికి బ్రేకులు పడుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్ నగర రూపురేఖలను మార్చేలా వ్యూహాత్మకంగా ప్రారంభించిన రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణ ప్రాజెక్టులకు ప్రస్తుత ప్రభుత్వం తగిన నిధులు కేటాయించకపోవడంతో ఒకొకటిగా రద్దయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో రూపొందించిన నానల్‌నగర్ చౌరస్తా విస్తరణ, కేబీఆర్ పారు చుట్టూ మల్టీలేవల్ ఫ్లైఓవర్ల ప్రాజెక్టులకు అవసరమైన నిధులు మంజూరు కాకపోవడంతో వాటిని రద్దు చేసే చర్యలు ముందుకు వచ్చాయి.
నగరంలో అత్యంత కీలకమైన రసూల్‌పూర జంక్షన్ వికేంద్రీకరణ, పాటిగడ్డ కనెక్టివిటీ పనులకు భూసేకరణ గండం చుట్టుముట్టింది. స్థల యజమానులకు రూ.కోట్లు చెల్లించాల్సి ఉండగా, నిధులు విడుదల కాకపోవడంతో ఇవి కూడా పూర్తయ్యే పరిస్థితి లేదు. తాజాగా కిస్మత్పూర్ గ్రామంలోని కారిడార్ నంబరు 19 పరిధిలోని (ఎడమ వైపు) బండ్లగూడ జాగీర్ మీదుగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నుంచి చేవెళ్ల రోడ్డు వరకు ప్రతిపాదించిన రహదారి నిర్మాణానికి ప్రజా ప్రయోజనాల కోసం 77 చోట్లకు గానూ 13,108.30 చదరపు గజాల భూమి అవసరమని నిర్ణయించారు. భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేయగా… సేకరణ కష్టమేనని అధికారులు నిర్థారణకు వచ్చారు. హెచ్-సిటీ పేరుతో ప్రకటనలు గుప్పించడమే తప్ప, ఆచరణలో భూసేకరణకు రూపాయి కేటాయించడంలేదని నగరవాసులు మండిపడుతున్నారు.