హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ధరణి సమస్యలను ఈ నెల 28లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం ఆదేశించారు. వీటితోపాటు కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోనివారి కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంబంధిత అంశాలపై దృష్టి సారించాలని చెప్పారు. ఈ నెలాఖరు వరకు ఈ మూడింటిని ప్రాధాన్యాంశాలుగా స్వీకరించి, పనిచేయాలని సూచించారు. ధరణిలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లు వెంటనే జరుగుతున్నప్పటికీ, సాంకేతికంగా పలు సమస్యలున్నాయన్నారు. నిషేధిత భూముల దరఖాస్తులు, గ్రీవెన్స్ ఆఫ్ ల్యాండ్ మ్యాటర్స్ మాడ్యూల్లో వచ్చిన దరఖాస్తులు, కోర్టు కేసులకు సంబంధించిన భూ సమస్యలన్నింటిని ఈ నెల 28 లోగా ధరణిలో పరిష్కరించాలని స్పష్టంచేశారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా బృహత్ ప్రకృతివనాల కోసం ప్రతి మండలానికి ఐదేసి స్థలాలను గుర్తించాలని సూచించారు. మల్టీలెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్, వైకుంఠధామాల నిర్మాణాలను ఈ నెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పౌరులు అడిగిన సమాచారాన్ని ఇవ్వండి
సమాచార హక్కు చట్టం కింద పౌరులు అడిగిన అంశాలపై సరైన సమాచారం ఇవ్వాలని అన్ని శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. అన్ని శాఖల్లో సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆయాశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు, కార్యదర్శులు నియమించిన డిజిగ్నేటెడ్ అధికారులకు ఇటీవల జారీ చేసిన నోట్లో సూచించారు.