హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో మరో సమావేశాన్ని ఏర్పాటుచేస్తామని సీఎస్ రామకృష్ణారావు ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టంచేశారు. పీఆర్సీ నివేదిక తుది దశకు చేరుకున్నదని, త్వరలోనే నివేదికను తెప్పించి మరోసారి సమావేశాన్ని నిర్వహిస్తామని నేతలకు హామీనిచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్(జేఎస్సీ)సమావేశాన్ని శుక్రవారం సీఎస్ కే రామకృష్ణారావు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యలు, డిమాండ్లను సమావేశం ముందుంచారు. వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఆర్థికేతర అంశాలను త్వరగా పరిష్కరించాలని సీఎస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఉద్యోగుల హెల్త్‌కార్డులను జూన్ 2న జారీచేస్తామని సీఎస్ ప్రకటించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా డిజిటల్ హెల్త్‌కార్డులను లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్పారు. 2003 డీఎస్సీ టీచర్లు, 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉద్యోగులకు పాత పింఛన్ అమలుపై ఉద్యోగ సంఘాల నేతలు సమావేశంలో ప్రస్తావించారు. సమావేశంలో టీఎన్జీవో నేతలు జగదీశ్వర్, సత్యనారాయణగౌడ్, శ్రీనివాసరావు, బీశ్యామ్, లచ్చిరెడ్డి, రామకృష్ణ, రాములు, పుల్గం దామోదర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ప్రేమ్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.