రెండు నెలల్లో ఆవిరైన క్రిప్టో సంపద
న్యూఢిల్లీ, జనవరి 22: బిట్ కాయిన్ కానీ..మరే క్రిప్ట్రోకరెన్సీలోనైనా ఇటీవల జరుగుతున్నదొక్కటే. ఏ రోజుకారోజు అవి పడిపోతున్నాయ్. ఇన్వెస్లర్ల సంపదను హరించివేస్తున్నాయ్. కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పరిరక్షణకు రెండేండ్ల క్రితం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ప్రవేశపెట్టిన ఉద్దీపన ప్యాకేజీని ఉపసంహరిస్తామని, వడ్డీ రేట్లను పెంచుతామన్న ప్రకటన వెలువడినప్పటి నుంచి క్రిప్టో కరెన్సీల భారీ పతనానికి నాందిపడింది. వారంలో ఏడు రోజులూ ట్రేడయ్యే క్రిప్టోకరెన్సీలు ఈ శనివారం సైతం తీవ్రంగా క్షీణించాయి. అంతర్జాతీయ ఎక్సేంజీల్లో క్రిప్టోకరెన్సీల్లో ప్రధానమైన బిట్‌కాయిన్ 10 శాతంపైగా పడిపోయి 34,000 డాలర్ల దిగువకు చేరింది. 2021 జూలై తర్వాత ఈ కరెన్సీకి ఇదే కనిష్ఠస్థాయి. గతేడాది నవంబర్‌లో 68,000 డాలర్ల రికార్డుస్థాయి నుంచి ఈ కరెన్సీ 50 శాతం విలువను కోల్పోయింది. దీని మార్కెట్ విలువలో 600 బిలియన్ డాలర్లకుపైగా నష్టపోయింది. మొత్తం క్రిప్టోకరెన్సీలన్నీ కలిపి ఈ రెండు నెలల్లో 1 ట్రిలియన్ డాలర్లకుపైగా (దాదాపు రూ.75 లక్షల కోట్లు) ఇన్వెస్టర్ల సంపదను హరించివేశాయి.