మేడ్చల్/ మేడ్చల్ రూరల్ : హైదరాబాద్ ఉత్తరం వైపు ఐటీని విస్తరించే దిశగా మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలో ఏర్పాటు చేసిన గేట్ వే ఐటీ పార్కుకు మంత్రి కేటీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. మంత్రి సభకు జనం భారీ ఎత్తున తరలివచ్చారు. సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో పాటు యువకులు, విద్యార్థులు వచ్చారు. వేలాది మందితో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భారీగా జనం తరలివచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారుల సారథ్యంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిలకు కళాకారులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మేడ్చల్, శామీర్పేట మండలాలతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి నాయకులు వచ్చారు. గుండ్లపోచంపల్లిలో మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కండ్లకోయ నుంచి పూడూరుకు వెళ్తుండగా మునీరాబాద్ వద్ద సర్పంచ్ గణేశ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పూడూరు యువకులు మునీరాబాద్ చౌరస్తా నుంచి పూడూరు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.