(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : సైబర్ నేరాలు, శాంతిభద్రతల పేరిట ఏఐ ఆధారంగా పనిచేసే నాలుగు హై-ఎండ్ టెక్టూల్స్ను కొనుగోలు చేయాలన్న రేవంత్ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అధునాతన టెక్టూల్స్ రాష్ట్ర ప్రజలపై ఒకవిధంగా నిఘా నేత్రంగా పనిచేస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ టూల్స్ ప్రభుత్వం చేతికి వస్తే.. ప్రతిపక్ష నేతలకే కాదు రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి వ్యక్తిగత గోప్యతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కు అని, అయితే.. నిఘా పేరిట రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ఈ చర్య గోప్యతా హక్కును కాలరాయడం కిందికే వస్తుందని మండిపడుతున్నారు. వ్యక్తుల అనుమతి లేకుండా వారి సమాచారాన్ని సేకరించడం, డివైజ్‌లను అన్‌లాక్ చేయడం ఐటీ చట్టం, 2000 నిబంధనల ప్రకారం అక్రమ హ్యాకింగ్గానే పరిగణిస్తారని నిపుణులు గుర్తుచేస్తున్నారు. మొత్తంగా రేవంత్ ప్రభుత్వ చర్యలు రాష్ట్ర ప్రజల వ్యక్తిగత గోప్యతను, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాసేలా ఉన్నాయని మండిపడుతున్నారు.
ప్రతిపక్ష పార్టీ నేతలతోపాటు రాష్ట్ర ప్రజలపై నిఘా పెట్టడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం టాక్ వాకర్, సెలీబ్రైట్ ఇన్సైట్స్, సైబర్ ఫోరెన్సిక్ హబ్ టూల్/సాఫ్ట్వేర్, ఇన్సైట్ టూల్ వంటి హై-ఎండ్ ఏఐ టెక్ టూల్స్‌ను కొనుగోలు చేస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యక్తుల అనుమతి లేకుండా ప్రభుత్వాలు ఇలా చేయడం రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడం కిందకే వస్తుందని టెక్ నిపుణులు, న్యాయ కోవిదులు చెప్తున్నారు. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన విషయాల్లో మాత్రమే వ్యక్తులపై నిఘాకు అనుమతులు ఉన్నాయని, అలా చేయాలని అనుకున్నప్పుడు కూడా న్యాయస్థానాలకు సహేతుక సాక్ష్యాలను సమర్పించి, అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని గుర్తుచేస్తున్నారు. అయితే, ఇదేమీ చేయకుండా రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అక్రమ హ్యాకింగ్ కిందికే వస్తుందని, దీనికి ఎంతమాత్రం చట్టబద్ధత ఉండబోదని చెప్తున్నారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. వ్యక్తిగత గోప్యత.. ప్రాథమిక హక్కు. దేశ భద్రత వంటి సున్నితమైన అంశాల్లో మాత్రమే నిఘాకు అనుమతి ఉంటుంది. కోర్టుల నుంచి సరైన అనుమతులు తీసుకోకుండా ఎవరిమీదనైనా నిఘా పెడితే, అది రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమే.. ఇది అక్రమం. 2017లో కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పింది’ అని బెంగళూరు అర్బన్ కోర్టులో విధులు నిర్వహిస్తున్న న్యాయవాది ఒకరు తెలిపారు. వ్యక్తులపై నిఘా పెట్టడానికి కారణమైన పరిస్థితులు బలంగా ఉంటేనే కోర్టులు నిఘాకు అనుమతి ఇస్తాయని, సాధారణ పరిస్థితుల్లో ఇది కుదరదని ఆయన పేర్కొన్నారు.
వ్యక్తుల అనుమతి లేకుండా, జాతీయ భద్రత వంటి సున్నితమైన కారణాలు చూపకుండా వ్యక్తుల ఫోన్ కాల్స్‌ను రికార్డు చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ఉల్లంఘించడమేనని సిటీ సివిల్ కోర్టులో పనిచేసే న్యాయవాది, టెక్ నిపుణురాలు ప్రియాంక అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడినవారికి ఐటీ చట్టంలోని సెక్షన్ 66, 72 ప్రకారం మూడేండ్లపాటు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉన్నదని ఆమె పేర్కొన్నారు. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం.. అదనపు శిక్షలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. వ్యక్తుల అనుమతిలేకుండా వారి సమాచారాన్ని సేకరించడంగానీ, డివైజ్‌లను అన్‌లాక్ చేయడంగానీ, అందులోని సమాచారాన్ని తీసుకోవడం గానీ ఐటీ యాక్ట్, 2000 నిబంధనల ప్రకారం అక్రమ హ్యాకింగ్గానే పరిగణిస్తారని ఢిల్లీకి చెందిన టెక్ నిపుణుడు నీరజ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సెక్షన్లు 43, 66, 72లో ప్రత్యేక ప్రస్తావన కూడా ఉన్నట్టు గుర్తుచేశారు. జాతీయ భద్రత, నేరాలు, శాంతిభద్రతల విషయంలోనే ఫోన్ కాల్స్, డాటాను విశ్లేషించాలని ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885లో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయన్న నీరజ్.. పౌరులపై ముందస్తు నిఘా పెట్టడం చట్టవిరుద్ధమేనని పేర్కొన్నారు.
దేశ భద్రతకు ప్రమాదం కలిగించే ద్రోహులపై, సైబర్ నేరగాళ్లపై నిఘా పెట్టినట్టు సాధారణ ప్రజలపై నిఘా పెట్టడం ఎంతమాత్రం సరికాదు. ఏఐ ఆధారంగా పనిచేసే ఇలాంటి హైఎండ్ టెక్ టూల్స్‌తో పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగొచ్చు. ఇది ముమ్మాటికీ భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాయడమే. లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులపై నిఘాను ఉంచడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు.