Georgina Rodriguez | దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన చిరకాల ప్రేయసి జార్జినా రోడ్రిగ్జ్(Georgina Rodriguez)తో కలిసి ఏడడగులు వేయబోతున్నాడు. గత ఎనిమిదేళ్లుగా డేటింగ్లో ఉన్న వీరు తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని జార్జినా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. రొనాల్డో జార్జినాకు నిశ్చితార్థం ఉంగరం తొడగగా, దాన్ని చూపిస్తూ ”అవును, నేను ఒప్పుకుంటున్నాను. ఈ జన్మలోనూ, నా ప్రతి జన్మలోనూ అతడితోనే ఉండాలని అంటూ జార్జినా రాసుకోచ్చింది”. రొనాల్డో, జార్జినా 2016లో మాడ్రిడ్‌లో కలుసుకోగా.. అప్పటినుంచి వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు అనౌన్స్ చేశారు. ఈ జంటకు ఐదుగురు పిల్లలు ఉండగా.. అందులో ఇద్దరు జార్జినాకు జన్మించారు.
మరోవైపు వీరి ఎంగేజ్మెంట్లో క్రిస్టియానో జార్జినాకి ఇచ్చిన ఉంగరం ధర ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఉంగరం ధర గురించి ఇప్పటికి అనేక వార్తలు వస్తుండగా.. ఈ రింగ్ ధర సుమారు $2 మిలియన్ల నుండి $5 మిలియన్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 16.8 కోట్ల నుంచి రూ. 42 కోట్లు) వరకు ఉండవచ్చని తెలుస్తోంది.