జోగుళాంబ గద్వాల్ : నేరాల తగ్గుదల, వేగవంతమైన దర్యాప్తు, ప్రజాభద్రతే పోలీసుల లక్ష్యమని జోగుళాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ( Srinivas rao) అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో 2025 సంవత్సరానికి సంబంధించిన జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన శాంతి–భద్రతలు, నేర నియంత్రణ, మహిళలు – బాలికల భద్రత, రోడ్డు భద్రత, సైబర్ నేరాల నియంత్రణలో సాధించిన విజయాలను వివరించారు.
2025 సంవత్సరంలో జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా రోజువారీ విధులతో పాటు ప్రకృతి విపత్తుల సమయంలో కూడా ప్రజలకు నిరంతర సేవలు అందించారని ఎస్పీ తెలిపారు. 2025లో జిల్లాలో సంచలనం సృష్టించిన పలు హత్య కేసులను సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో అత్యంత వేగంగా ఛేదించిందని వెల్లడించారు. గద్వాల్ టౌన్, , శాంతినగర్, ధరూర్ పరిధిలో జరిగిన హత్యలను ప్రమాదాలుగా చూపే ప్రయత్నాలను భగ్నం చేసి నిందితులను అరెస్ట్ చేసి నగదు, వాహనాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. శాంతినగర్ పరిధిలో అప్పు పేరుతో హైదరాబాద్కు పిలిపించి కిడ్నాప్ చేసిన కేసును కేవలం 8 గంటల్లోనే ఛేదించి బాధితుడిని పోలీసలు శాఖ సురక్షితంగా కాపాడిందని పేర్కొన్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించామని చెప్పారు. ఎన్నికల తనిఖీల్లో రూ.3,50,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 3 కేసులు నమోదు చేసి, 174 మెమోలు జారీ చేసి, 303 మందిని బైండోవర్ చేశామని వివరించారు. నాకాబందీ ఆపరేషన్లతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు(Panchyat Elections)
విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. నేర నియంత్రణలో భాగంగా 2024లో నమోదైన 2,703 కేసులు, 2025లో 2410కు తగ్గాయని, దీంతో నేరాల రేటు సుమారు 11 శాతం తగ్గినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు 2024లో 6, 359 కేసులు నమోదు కాగా 2025లో 5270 దరఖాస్తులను స్వీకరించి తక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
మహిళలు, బాలికల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ షీ టీమ్స్, పోలీసు కళాబృందం, భరోసా కేంద్రం ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. “ప్రజాభద్రత పోలీసు బాధ్యత” అనే నినాదంతో గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రజలకు అవగాహన కల్పించామని చెప్పారు. భరోసా కేంద్రంలో 81 కేసులు నమోదు కాగా, అన్ని కేసుల్లో కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు 35 మంది బాధితులకు నష్టపరిహారం అందించినట్లు తెలిపారు. జిల్లా షీ టీమ్స్ ద్వారా 136 అవగాహన సదస్సులు నిర్వహించగా, 122 ఫిర్యాదులు స్వీకరించి, 133 పిట్టీ కేసులు, 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు వివరించారు.