లండన్: వర్షం వస్తే క్రికెట్ మ్యా చ్ల ఫలితాలను నిర్దేశించే ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతిని కనుగొన్న సృష్టికర్తలలో ఒకరైన ఫ్రాంక్ డక్‌వర్త్ కన్నుమూశారు. 84 ఏండ్ల డక్‌వర్త్ ఈనెల 21న మరణించినట్టు ఈఎస్పీఎన్ ఒక కథనంలో పేర్కొంది. ఇంగ్లండ్‌కు చెందిన ఈ గణాంకవేత్త.. టోనీ లూయిస్‌తో కలిసి రూపొందించిన విధానాన్ని క్రికెట్లో 1997 నుంచి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అమలుచేస్తోంది. ఆస్ట్రేలియా స్టాటిస్టిషియన్ స్టీవెన్ స్టెర్న్ సూచించిన పలు మార్పుల తర్వాత ఐసీసీ ఈ విధానాన్ని ‘డక్‌వర్త్ లూయి స్టెర్న్ – డీఎల్ఎస్)గా మార్చింది. టోనీ లూయిస్ 2020లోనే మరణించారు. 2010లో డక్‌వర్త్, లూయిస్‌కు ప్రతిష్టాత్మక మెంబర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటీష్ ఎంపైర్ (ఎంబీఈ) అవార్డు లభించింది.
సుహాస్ @1
ఢిల్లీ: భారత పారా షట్లర్ సుహాస్ యతిరాజ్ ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ర్యాంకులలో అగ్రస్థానానికి ఎగబాకాడు. మంగళవారం బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ర్యాంకింగ్స్ (పురుషుల సింగిల్స్)లో సుహాస్.. ఫ్రెంచ్ షట్లర్ లుకాస్ మజుర్ను వెనక్కినెట్టి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. 60,527 పాయింట్లతో సుహాస్ మొదటి స్థానంలో ఉండగా 58,953 పాయింట్లతో లుకాస్ రెండో స్థానానికి పడిపోయాడు. టోక్యో ఒలింపిక్స్‌లో ఎస్-4 కేటగిరీలో రజతం నెగ్గిన సుహాస్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్నాడు.
అభినవ్‌కు స్వర్ణం
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ రైఫిల్ అసోసియేషన్(టీఆర్ఏ) ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఐపీఎస్ అధికారి అభినవ్ పసిడి పతకంతో మెరిశాడు. మంగళవారం జరిగిన 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ విభాగంలో అభినవ్(280) అగ్రస్థానంలో నిలువగా, నీరజ్(275), వీక్షిత్వీర్(272) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. మిగతా విభాగాల్లో అనిల్‌కుమార్, ఫైజల్, యువక్, రష్మిని, నిరంజన్ స్వర్ణాలు సాధించారు.