Amaravati | ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించింది. రాజధాని ప్రాంత నిర్మాణం కోసం రూ.32,500 కోట్ల రుణం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో వరల్డ్ బ్యాంక్-ఏడీబీ నుంచి రూ.14వేల కోట్లను రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రుణంగా తీసుకోనుంది. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (ఎన్ఏబీఎఫ్ఐడీ) నుంచి రూ.10 వేల కోట్లు, నాబార్డు నుంచి రూ.7 వేల కోట్లను రుణం తీసుకోనుంది.
ఇదిలా ఉంటే ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఏపీపీఎఫ్సీ) నుంచి రూ.1500 కోట్ల రుణానికి సంబంధించి ఇప్పటికే సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. మిగతా సంస్థలతోనూ సంప్రదింపులు జరపగా, రుణం మంజూరుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. కాగా, అమరావతి అభివృద్ధి కోసం సీఆర్డీఏ ఇప్పటికే వరల్డ్ బ్యాంక్, ఏడీబీల నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కోనుంచి 11 వేల కోట్లు కలిపి మొత్తంగా రూ.26 వేల కోట్ల రుణం తీసుకుంది.