హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు పరస్పరం వ్యక్తిగత దూషణలు ఆపి రైతులకు నీళ్లు అందించడంపై దృష్టి సారించాలని సీపీఐ కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. ఇందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై సాగునీటి ప్రాజెక్టుల ఇంజినీర్లతో ప్రత్యేక కమిటీ వేయాలని, ఈ కమిటీలో కేంద్ర జలవనరుల నిపుణులతోపాటు రాజకీయ పార్టీలు సూచించే నిపుణులను చేర్చి కమిటీ సిఫారసు మేరకు తుది నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.
సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహతో కలిసి కూనంనేని మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.