సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : నూతన సంవత్సర వేడుకలకు సమయం దగ్గర పడుతున్నది. మత్తు పదార్థాలు విక్రయించే వారు కొత్త దారులు వెతుకుతున్నారు. గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో గంజాయిని ద్రవరూపంలోకి మార్చేసి విక్రయించేందుకు పథకం వేశారు. ఆదిలోనే డ్రగ్స్ స్మగ్లర్లు వేసిన ఫ్లాన్‌ను వెస్ట్, సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. అంతర్రాష్ట్ర ముఠాతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.35 లక్షల విలువైన 3.5 లీటర్ల హాష్(వీడ్) ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు.
విశాఖపట్నం, పాయకరావుపేటకు చెందిన సంపతి కిరణ్‌కుమార్ అలియాస్ జాన్ హైదరాబాద్‌లోని మణికొండలో నివాసముంటున్నాడు. ఐటీఐ పూర్తి చేసిన కిరణ్‌కుమార్ కొన్నాళ్లు ఈస్ట్‌గోదావరి జిల్లాలో మెడికల్ రిఫ్రజెంటేటివ్గా పనిచేశాడు. తక్కువ సమయంలో అధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అంతలోనే గంజాయి, యాష్ ఆయిల్ దందా చేస్తే భారీగా సంపాదించవచ్చని తెలుసుకుని దందాలోకి దిగాడు. 2020లో ఈస్ట్‌గోదావరి జిల్లా పీఠాపురం టౌన్ పోలీసులకు తన సహచరుడు మెహన్‌తో కలిసి పట్టుబడి జైలుకు వెళ్లాడు.
జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత పాడేరుకు చెందిన వినోద్ అలియాస్ విన్నుతో పరిచయం ఏర్పడింది. అక్కడ తక్కువ ధరకు హాష్ ఆయిల్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారం రోజుల కిందట కిరణ్ 1.5 లీటర్ల హాష్ ఆయిల్‌ను నగరానికి తీసుకువచ్చాడు. సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజేశ్ గోల్కొండ ఓయూ కాలనీలో గోల్కొండ పోలీసులతో కలిసి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద లభించిన హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకొని తదుపరి విచారణకు నిందితుడిని గోల్కొండ పోలీసులకు అప్పగించారు.
నగరంలోని జహనుమాకు చెందిన హమాలీ పనిచేసే మహ్మద్ ఇర్ఫాన్, యాప్రాల్‌కు చెందిన ఫుడ్ డెలివరీ బాయ్ షేక్ కమల్ స్నేహితులు. ప్రతి రోజు తమ పనులు పూర్తి చేసుకొని ఇద్దరు కలుసుకునే వారు. వచ్చే ఆదాయంతో తమ అవసరాలు, విలాసవంతమైన జీవనం గడుపలేకపోతున్నామని చర్చించుకునేవారు. కొత్త సంవత్సరం వస్తుంది, ప్రస్తుతం హైదరాబాద్‌లో గంజాయి కూడా దొరకడం లేదు, హాష్ ఆయిల్ తెచ్చి అమ్మితే మంచి లాభాలు గడించవచ్చని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా పాడేరుకు చెందిన గౌతమ్‌తో పరిచయం ఏర్పడింది.
ఇద్దరు వైజాగ్ సమీపంలోని సింహాచలంలో గౌతమ్‌ను కలిశారు. 2 లీటర్ల హాష్ ఆయిల్ కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. నగరంలో ఒక మిల్లీ లీటర్ రూ.వెయ్యి చొప్పున విక్రయించాలని ప్లాన్ వేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర బృందం ఫలక్‌నుమా పోలీసులతో కలిసి ఫలక్‌నుమాలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 లీటర్ల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు తదుపరి విచారణను ఫలక్‌నుమా పోలీసులకు అప్పగించారు. ఈ సమావేశంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీలు(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు, చక్రవర్తి గుమ్మి, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.