డిండి, జనవరి 29: నల్లగొండ జిల్లా డిండిలో జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ శంకుస్థాపన రసాభాసగా మారింది. స్థానిక ప్రజాప్రతినిధులను పిలువకుండా బీజేపీ నాయకులు నియోజకవర్గానికి సంబంధం లేని బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారితో పనులు ప్రారంభించేందుకు పిలవడం ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం ఆచారి వస్తున్నట్టు తెలుసుకొన్న డిండి టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు రాజీవ్చౌరస్తా వద్దకు చేరుకొన్నారు. పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆచారి ర్యాలీగా రాజీవ్ చౌరస్తా వద్దకు వస్తుండగా భూమిపూజ విరమించుకోవాలని టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇరువర్గాలు రోడ్డుపై బైఠాయించాయి. పోలీసులు వారిని సముదాయించడంతో శంకుస్థాపన కార్యక్రమం రద్దయ్యింది.