దొంగలుగా మార్చిన కరోనా!
ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి చాలామందిని ఉన్న ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు దూరంచేసింది. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారిలో ఎందరో తప్పటడుగులు వేశారు. డ్రగ్స్, సైబర్ నేరాలు సహా పలు మోసాలకు బాధ్యులుగా మారి జైలు పాలయ్యారు.
- ఉపాధి కరువై నేరాల బాట!
- నేరప్రవృత్తి వైపు నిరుద్యోగ యువత
- గత రెండేండ్లుగా 20% మంది వారే
- సైబర్, మల్టీలెవల్ మార్కెటింగ్ దోపిడీ
- ఫలితాలు ఇవ్వని పోలీసుల కౌన్సెలింగ్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి చాలామందిని ఉన్న ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు దూరంచేసింది. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారిలో ఎందరో తప్పటడుగులు వేశారు. డ్రగ్స్, సైబర్ నేరాలు సహా పలు మోసాలకు బాధ్యులుగా మారి జైలు పాలయ్యారు. బయటకొచ్చాక కొందరు మాత్రమే తమ తప్పులు సరిదిద్దుకొన్నారు. నిరుడు హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో పలు నేరాలకు సంబంధించి 30,690 కేసులు నమోదయ్యాయి. వీటిలో 80 శాతం మంది పాత నేరస్తులే ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మరో 20 శాతం మంది కొవిడ్ కారణంగా నేరాల బాట పట్టినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ సంవత్సరం కూడా సుమారు 35 వేలకు పైగా కేసులు ఇప్పటికే నమోదు కాగా, వాటిలో కొందరు నేరస్తులు కరోనా సమయంలో ఎదురైన పరిస్థితులను ఎదుర్కోవడానికి డబ్బు సంపాదన కోసం నేరాలు చేసినట్టు అంగీకరించారు.
చాలామంది జీవనోపాధి కోల్పోయి కష్టాల్లో కొట్టుమిట్టాడి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. కరోనా టైమ్‌లో ఉద్యోగం కోల్పోయి ఆ తర్వాత డబ్బుల కోసం నేరాల బాట పట్టిన వారిని పోలీసులు వేర్వేరు కేసుల్లో విచారిస్తుంటే ఇలాంటి విషయాలు వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇటీవల పోలీసులకు చిక్కిన పలువురు నేరగాళ్లు గతంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసిన వాళ్లే అయినా కరోనా మహమ్మారి కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత కొంతమేర తిరిగి పుంజుకోవాలని చూసినా అవకాశాలు రాకపోవడంతో గత రెండేండ్లుగా నేరాల బాట పట్టినట్టు పోలీస్ గణాంకాలే చెప్తున్నాయి.
ఫలితమివ్వని కౌన్సెలింగ్
గతంలో నేరచరిత్ర లేని నేరగాళ్లుగా కొత్తగా నమోదైన వారిని కౌన్సెలింగ్ చేసి సన్మార్గంలో నడిపిద్దామని పోలీసుల ప్రయత్నాలు ఫలించడం లేదు. ఒకసారి అక్రమ సంపాదనకు అలవాటు పడిన వాళ్లు తిరిగి వేరే దారులు చూసుకోవడం కష్టమేనని, అలాంటి వారు నేరాలబాట వీడటం లేదని పోలీసులు పేర్కొన్నారు. నేరాలను వృత్తిగా ఎంచుకున్న వారిని ఆ బాట నుంచి బయటకు తీసుకురావడం చాలా కష్టమని పోలీస్ అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న పలు నేరాల్లో విద్యావంతులైన యువకులను గుర్తించిన పోలీసులు వారి గత చరిత్రను తవ్వి తీస్తే ఎక్కడా నేరాల జాడలేదు. దీంతో అసలు వీరు నేరాలు ఎందుకు చేస్తున్నారని పోలీసులు వెలికి తీయగా, కరోనా సమయంలో తలెత్తిన సమస్యలు, వారి ఆర్థిక స్థితిగతులు నేరప్రవృత్తికి దారితీశాయని తెలిసింది. విచారణ సమయంలో కొందరు కావాలనే అబద్ధాలు చెప్తున్నారని పోలీసులు అనుకున్నప్పటికీ నేరగాళ్ల వివరాలు సేకరించే క్రమంలో వారు చెప్పేది వాస్తవమేనని తేలింది. జేబు దొంగతనాలతో మొదలై ముఠాగా ఏర్పడి దోపిడీలు, బెదిరింపులకు పాల్పడుతున్న వారు కూడా కొవిడ్‌లో ఉద్యోగాలు పోయి ఆర్థికంగా చితికినవారిలో చాలా మంది ఉన్నారని పోలీసులు చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక యువకుడు సైన్యంలో చేరాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే మళ్లీ ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి కారణంగా చాలామంది ఉద్యోగాలు పోయాయి. ఈ యువకుడి ఉద్యోగం కూడా పోయింది. బతుకుదెరువు కోసం గంజాయి అమ్మి సంపాదించడం మొదలుపెట్టాడు. ఒకరి నుంచి ఇద్దరికి అలా 30 మందికిపైగా సరఫరా చేస్తున్నాడు. ఇటీవల హెచ్‌న్యూ పోలీసులకు చిక్కిన ఆ యువకున్ని వారు విచారించగా, కొవిడ్ అతని జీవితాన్ని నేరమయం చేసిందనే విషయం బయటపడింది.
నగరంలోని బోడుప్పల్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కరోనా వేళ తన ఉద్యోగం కోల్పోయాడు. లాక్డౌన్ ముగిశాక కిరాణా దుకాణం ప్రారంభించాడు. కానీ అతనికి సంపాదన సరిపోకపోవడంతో మల్టీలెవల్ స్కీమ్‌లో చేరాడు. ఒకవైపు సభ్యులను చేర్పిస్తూనే కమీషన్‌తో సంపాదించడం మొదలుపెట్టాడు. రెండేండ్లుగా సైబర్ ముఠాలకు కమీషన్ పద్ధతిలో మ్యూల్ ఖాతాలు తీసుకోవడానికి అవసరమైన మనుషులను సమకూర్చి డబ్బులు సంపాదించసాగాడు. సైబర్ వ్యవహారం బయటపడటంతో ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తున్నాడు.
నగరంలోని మరో ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న కొందరిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్ నిర్వాహకులను పోలీసులు ప్రశ్నించగా, అసలు విషయం బట్టబయలైంది. వారు కరోనా సమయంలో ఐటీ ఉద్యోగాలు కోల్పోగా, చాలారోజులు వేర్వేరు చోట్ల పనిచేశారు. ఐటీ ఉద్యోగాలు మళ్లీ రాకపోవడంతో బెట్టింగ్ లైన్లోకి మళ్లాల్సి వచ్చినట్టు పోలీస్ విచారణలో వారు చెప్పారు. కరోనా కష్టాలతో ఇలా మారానని చెప్పిన యువకుడు.. మరోసారి బెట్టింగ్‌కు పాల్పడబోనంటూ ప్రమాణం చేసిన తర్వాత మళ్లీ బెట్టింగ్‌లో దొరుకడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

