న్యూఢిల్లీ: ప్రస్తుతం రకరకాలుగా మార్పు చెందుతున్న కోవిడ్ వైరస్ నుంచి కోవాగ్జిన్ టీకా రక్షణ కల్పిస్తుందని ఆ టీకాను తయారు చేస్తున్న భారత్ బయోటెక్ వెల్లడించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ వైరాలజీ, భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నిర్వహించిన అధ్యయనాల్లో ఈ సంగతి రుజువైందని పేర్కొన్నది. ప్రస్తుతం బయటపడుతున్న అన్నిరకాల కరోనా వైరస్ లకు టీకా చెక్ పెడుతుందని తెలిపింది. ప్రయోగశాల పరీక్షల్లో ప్రస్తుతం పెచ్చరిల్లుతున్న కీలక వైరస్లకు యాంటీబాడీలు తయారయ్యాయని విరించింది. ఈ అధ్యయనాల ఫలితాలు క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. “కొత్తరకాలపై కోవాగ్జిన్ ప్రభావశీలతకు అంతర్జాతీయ గుర్తింపు లబిస్తున్నది. కంపెనీ కీర్తి కిరీటంలో ఇది మరొక కలికి తురాయి” అని భారత్ బయోటెక్ సహ-వ్యవస్థాపకురాలు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ట్విట్టర్లో పేర్కొన్నారు.