న్యూఢిల్లీ: స్వదేశీ యుద్ధ నౌక విక్రాంత్‌ను సెప్టెంబర్ 2వ తేదీన జల ప్రవేశం చేయనున్నారు. కొచ్చిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. సుమారు 40 వేల టన్నులకుపైగా బరువు ఉన్న యుద్ధ నౌకల్ని తయారు చేసిన దేశాల జాబితాలో ఇండియా చేరినట్లు ఇండియన్ నేవీ కమాండర్ థాపర్ తెలిపారు. ఈ జాబితాలో అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి. స్వదేశీ యుద్ధ నౌక విక్రాంత్‌లో 2200 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. మహిళా ఆఫీసర్లకు, మహిళా అగ్నివీరులకు వసతి సౌకర్యాలు సపరేట్గా ఉంటాయని ఇండియన్ నేవీ పేర్కొన్నది. విక్రాంత్ యుద్ధ నౌక కోసం సుమారు 18 రాష్ట్రాల నుంచి ఎక్విప్మెంట్ అందినట్లు వైస్ అడ్మిరల్ ఎస్ఎన్ ఘోర్‌మేడ్ తెలిపారు. అంబాలా, దామన్, కోల్‌కతా, జలంధర్, కోటా, పూణె, న్యూఢిల్లీ నుంచి విక్రాంత్‌కు కావాల్సిన ఎక్విప్మెంట్ అందినట్లు తెలిపారు.
ఐఎన్ఎస్ విక్రాంత్‌కు కావాల్సిన మొత్తం 2500 కిలోమీటర్ల పొడువైన కేబుల్‌ను ఇండియాలోనే తయారు చేసినట్లు వైస్ అడ్మిరల్ తెలిపారు. ఇది గొప్ప అచీవ్మెంట్ అన్నారు. యుద్ధ నౌకకు కావాల్సిన స్టీల్‌ను ఇండియన్ ఆర్మీ, డీఆర్డీవో, సెయిల్ సహకారంతో తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ స్టీల్‌ను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు చెప్పారు. మిగ్-29కే ఆపరేషన్ కోసం విక్రాంత్‌ను డిజైన్ చేశామని, అయితే స్వదేశీయంగా తయారైన టెడ్‌బీఎఫ్ ఫైటర్ విమానాన్ని కూడా వాడనున్నట్లు ఘోర్‌మేడ్ తెలిపారు. రాఫేల్, ఎఫ్-18 విమానాల ట్రయల్స్‌ను కూడా నిర్వహించినట్లు ఆయన చెప్పారు.