మహబూబాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోత్ రవికుమార్(35) దారుణ హత్యకు గురయ్యారు. నిందితులు పట్టపగలే ట్రాక్టర్‌తో గుద్ది, గొడ్డళ్లతో నరికి చంపారు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవికుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, గెలుపొందిన అనంతరం టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు.
గురువారం ఉదయం 10 గంటల వరకు స్థానికంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ మాలోత్ కవితతో కలిసి పాల్గొన్నారు. అనంతరం బైకుపై మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి అక్కడి నుంచి బాబునాయక్తండాలోని తన ఇంటికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో కాపు కాచిన దుండగులు కౌన్సిలర్ బైక్‌ను ట్రాక్టర్‌తో ఢీకొట్టి 15 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు. అప్పటికే కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు కిందపడిన రవికుమార్‌ను నరికి పారిపోయారు. కొనఊపిరితో ఉన్న రవికుమార్‌ను జిల్లా దవాఖానకు తరలించి చికిత్స అందించే క్రమంలో మృతిచెందాడు.
రవికుమార్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రవికుమార్ హత్యతో మహబూబాబాద్‌లో విషాదం నెలకొంది. ఎంపీ మాలోత్ కవిత జిల్లా దవాఖానకు చేరుకొని మార్చురీలో ఉన్న రవి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ రవికుమార్ మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టారు. రవి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మంత్రి సత్యవతిరాథోడ్ ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.