‘విక్రమాదిత్య, ప్రేరణ జంట ప్రణయగాథకు అందమైన దృశ్యరూపమే ‘రాధేశ్యామ్’. వీరిద్దరి పయనంలో పంచుకున్న మధురానుభూతులు, ప్రోదిచేసుకున్న జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి హృదయాల్ని స్పృశిస్తాయి’ అని అంటున్నారు రాధాకృష్ణకుమార్. ఆయన దర్శకత్వంలో ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సోమవారం వాలెంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. నాయకానాయికల మధ్య చోటుచేసుకునే సరదా రొమాంటిక్ సన్నివేశాలతో గ్లింప్స్ ఆకట్టుకునేలా ఉంది. ‘మళ్లీ లైఫ్‌లో వాడి ముఖం చూడను..’ అంటూ కథానాయిక ప్రేరణ చెప్పిన సంభాషణతో మొదలైన గ్లింప్స్ ఆద్యంతం అలరించేలా సాగింది. ‘బాగా కుక్ చేస్తూ..ఇంత మంచిగా మాట్లాడే అబ్బాయికి ఇంకా పెళ్లెందుకు కాలేదో..’ అంటూ విక్రమాదిత్యను ప్రేరణ ప్రశ్నించే సన్నివేశంతో ఆసక్తిగా వీడియోను ముగించారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ఖేడ్కర్, ప్రియదర్శి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, నిర్మాణ సంస్థలు: గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.కె.రాధాకృష్ణకుమార్.