బిర్యానీ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే బిర్యానీ గుర్తుకొస్తుంది. ఎన్నో ఏండ్లుగా బిర్యానీకి హైదరాబాద్ పెట్టింది పేరు. ఇప్పుడిప్పుడే అన్ని ప్రాంతాల్లో బిర్యానీ రుచి లభిస్తున్నా.. హైదరాబాద్ బిర్యానీ టేస్టే వేరు. అయితే, హైదరాబాద్ బిర్యానీ ధర మహా అంటే నూటాయాభై, రెండొందల రూపాయల వరకు ఉంటుంది. అదే దుబాయ్‌లో లభించే బిర్యానీ.. చాలా కాస్ట్లీ గురూ..! అంటూ చెప్పుకుంటున్నారు పాకశాస్త్ర ప్రవీణులు. దుబాయ్‌లో ఈ రకం బిర్యానీ ఏకంగా రూ.20 వేల వరకు ఉన్నది.
దుబాయ్‌లో బొంబాయి బారో అనే రెస్టారెంట్ వినియోగదారులకు ప్రత్యేకమైన బిర్యానీలను పరిచయం చేసింది. దీని పేరు రాయల్ గోల్డ్ బిర్యానీ. రాయల్ గోల్డ్ బిర్యానీ తయారుచేస్తున్న ఏకైక రెస్టారెంట్ ఇదే కావడం విశేషం. ఈ రాయల్ గోల్డ్ బిర్యానీలో 23 క్యారెట్ల తినదగిన బంగారాన్ని ఉపయోగిస్తున్నట్లు బొంబాయి బారో రెస్టారెంట్ యాజమాన్యం పేర్కొంటున్నది. బంగారం బిర్యానీకి మరింత వన్నె చేకూరుస్తుందంటున్నారు ఈ రెస్టారెంట్ నిర్వాహకులు
బిర్యానీ తయారుచేసేందుకు మనం ఏ రకమైన బియ్యం తినడానికి ఇష్టపడతారనే విషయానికి యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తుంది. ఇలా ఆప్షన్ ఇస్తున్న రెస్టారెంట్ ప్రపంచంలో బహుశా ఇదొక్కటే కావచ్చు. బిర్యానీ ఆర్డర్ చేయడానికి ముందు బిర్యానీ రైస్, కీమా రైస్ వైట్, కుంకుమ బియ్యం ఎంపిక అవకాశాలను వినియోగదారులకు ఇస్తారు. వినియోగదారుడు ఏ రకం బియ్యం ఎంచుకుంటే ఆ బియ్యంతో బిర్యానీ వండి వడ్డిస్తారు.
థాల్కు కశ్మీర్ లాంబ్, ఢిల్లీ చాప్స్, రాజ్‌పుత్ చికెన్ కెబాబ్, మొఘలాయ్ కోఫ్తా, బిర్యానీతో మలై చికెన్ రోస్ట్ కూడా ఈ రెస్టారెంట్లో లభిస్తాయి. బేబీ బంగాళాదుంపలు, ఉడికించిన గుడ్లు, కాల్చిన జీడిపప్పు, ఫ్రై ఉల్లిపాయలు, పుదీనా రైటా, పచ్చడి కూడా వడ్డిస్తారు. బిర్యానీలో బియ్యం బరువు 3 కిలోలు మాత్రమే ఉంటుంది. ఇంత మొత్తం బిర్యానీ ఒక్కరే తినడం కష్టం. అందుకని కుటుంబ సమేతంగా రావాలని ఆ రెస్టారెంట్ యాజమాన్యం కోరుతోంది. రాయల్ గోల్డ్ బిర్యానీని కనీసం 45 నిమిషాల ముందుగానే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే అది మనకు అందుబాటులోకి వస్తుంది. ఈ బిర్యానీని తినేందుకు వివిధ ప్రాంతాల నుంచి బిర్యానీ ప్రియులు దుబాయ్‌కు వెళ్తుంటారు.