నిజామాబాద్ ఖలీల్ వాడి ఏప్రిల్ 22: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరాపూర్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున కొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించిన పోస్టర్లను చించి వేశారు. పోస్టర్ల చించివేతను గుర్తించిన బీఆర్ఎస్ నాయకులు వెంటనే అడ్డుకొని పోస్టర్లను తొలగించిన వ్యక్తులతోనే తిరిగి అతికించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును గులాబీ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించే రజతోత్సవ వేడుకకు భారీ స్పందన వస్తుండటంతో జీర్ణించుకోలేక కొంతమంది వ్యక్తులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేండ్లలో తెలంగాణను కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. ఏడాది కాకముందే కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్న ప్రభుత్వాలకు తెలంగాణ ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.