కాంగ్రెస్ తన దిశను మార్చుకోబోతోంది. దశ మారకపోవడంతో దిశనే మార్చేయాలని, కొత్త సైద్ధాంతిక పునాదులతో పార్టీని పునర్నిర్మించాలని సోనియా భావిస్తున్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీకిఅత్యంత సన్నిహితుడైన పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టంగానే చెప్పేశారు. రాజస్థాన్ వేదికగా జరిగే చింతన్ శిబిర్ వేదికగా పార్టీలో మార్పులు ఉంటాయని, సైద్ధాంతిక విషయాలపై కూడా మార్పులు వుంటాయని ప్రకటించారు. దీంతో సైద్ధాంతికంగా పార్టీ తన దిశను మార్చుకుంటుందని బాగా ప్రచారం జరుగుతోంది.
హిందుత్వను భుజానికెత్తుకోనున్న కాంగ్రెస్…
తన మూల సిద్దాంతమైన సెక్యులరిజం అన్న భావన నుంచి కాంగ్రెస్ బయటపడేందుకు వ్యూహం పన్నుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ ముస్లిం సంతుష్టీకరణ చేస్తుందని, హిందువులకు కాంగ్రెస్ వ్యతిరేకం అన్న ప్రచారం విపరీతంగా వుంది. ఈ ముద్రను మొత్తం తుడిచేయాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. పూర్తి హిందుత్వ కలర్‌ను తీసుకురావాలని నిశ్చయించుకుంది.
ప్రముఖ శైవ క్షేత్రమైన బాణేశ్వర్ ధామ్ వేదికగా కాంగ్రెస్ భారీ సభ నిర్వహించనుంది. 5 లక్షల మందితో ఓ సభ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ ద్వారానే తాము హిందుత్వకు, హిందువులకు అనుకూలమన్న గట్టి సంకేతాలను ఇవ్వనున్నారు. తాము హిందుత్వకు, హిందువులకు ఏమాత్రం వ్యతిరేకం కాదని ఓ విస్పష్ట ప్రకటన చేయనున్నారు. ఈసారి రంజాన్ మాసం సందర్భంగా కాంగ్రెస్ ఎక్కువగా ఇఫ్తార్ విందులు ఇచ్చినట్లు కనిపించలేదు. రాబోయే రోజుల్లో హిందుత్వ అజెండాను మోసేందుకు రెడీగా ఉన్న కారణంగానే ఇఫ్తార్ విందులకు కాంగ్రెస్ దూరమైంది.