BRS | పెద్ద కొడప్ గల్ (జుక్కల్): జుక్కల్ (Jukkal) నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జుక్కల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు కాలేదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మోసపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల ముందు ఎండగట్టేందుకే ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని నాయకులు తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు