దేశంలోనే ఎక్కడాలేని తొలి యూనివర్సిటీ కొత్తగూడేనికి వచ్చిందంటూ బాకాలు ఊదిన కాంగ్రెస్ పాలకులు.. దాని నిర్వహణ విషయంలో ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అనే సామెతలాగా ఆ యూనివర్సిటీ పరిస్థితి మారింది. అంతిమంగా అందులోని విద్యార్థులు మాత్రం అష్టకష్టాలు పడుతున్నారు. గొప్పకు మాత్రం దేశంలోనే తొలి యూనివర్సిటీ అంటూ చెప్పుకున్న కాంగ్రెస్ పాలకులు.. నిధులు ఇవ్వకుండా తోకముడిచారు. దీంతో యూనివర్సిటీలోని విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. చదువులు సక్రమంగా సాగక సతమతమవుతున్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరిట కాంగ్రెస్ సర్కారు ఏర్పాటుచేసిన తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ సమస్యలతో సతమతమవుతోంది. ఈ వర్సిటీపై రేవంత్ ప్రభుత్వం శీతకన్ను వేయడంతో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారింది. కాలేజీ ఏర్పాటై ఏడాది పూర్తయినా నేటికీ ఫ్యాకల్టీలేక అతిథి అధ్యాపకులతో కాలం వెళ్లదీస్తోంది. దీంతో విద్యార్థులు ఎవరితో చెప్పుకోలేక వారిలో వారే మదన పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్లాన్‌తో నిరుడు ఈ యూనివర్సిటీని ప్రారంభించింది. అయితే, ఈ వర్సిటీకి రూ.500 కోట్లు అవసరముంటుందని, వాటిని వెంటనే మంజూరు చేస్తామన్న వర్సిటీ ప్రారంభ సభలో సీఎం చెప్పారు. కానీ, ఆ తరువాత ఆ మాట మరిచారు. ఏడాది దాటినా ఆచూకీ లేరు. కేవలం రూ.46 కోట్లు మంజూరు చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో విద్యావ్యవస్థ ముందుకుసాగడంలేదు. ఈ క్రమంలో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుండడంతో పలు విద్యార్థి సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి.
భద్రాద్రి జిల్లాలో పాల్వంచ – కొత్తగూడెం మధ్యలో ఉన్న కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్ (కేఎస్ఎం)ను కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా మార్చింది. కానీ, అందులోని విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటుచేసిన యూనివర్సిటీకి గతంలో ఉన్న కోర్సులతోపాటు అదనంగా జియాలజీ, ఎన్విరాల్మెంటల్, ఓషన్ సైన్స్, వాతావరణ కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే మైనింగ్, ట్రిపుల్ ఈఈ, బీటెక్, బీఎస్సీ, ఎమ్మెస్సీతోపాటు ఇన్ సర్వీసు ఉద్యోగులకు కూడా బీటెక్ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే 1,100 మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువు కొనసాగిస్తున్నారు. 200 మంది డే స్కాలర్ ద్వారా చదువుకుంటున్నారు. వందల సంఖ్యలో ఉన్న విద్యార్థులకు సరైన ఫ్యాకల్టీ లేదు. దీంతో విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడున్న విద్యార్థులకు కేవలం 17 మంది రెగ్యులర్ అధ్యాపకులు మాత్రమే ఉన్నారు. మరో 25 మంది అతిథి అధ్యాపకులు ఉన్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్ 33 మంది ఉన్నారు. కొత్త యూనివర్సిటీ వచ్చాక యూజీసీ నిబంధనల ప్రకారం 128 మంది అధ్యాపకులు ఉండాల్సి ఉండగా చాలా తక్కువ మందితో సరిపెట్టుకోవడంతో కాలేజీ నిర్వహణ చేసే ప్రిన్సిపాల్‌కు తలకు మించిన భారంగా ఉంది. ప్రధాన కోర్సులకు డిమాండ్ ఉన్నా రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకపోవడంతో కొంత ఇబ్బందిపడాల్సి వస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఉన్నత చదువుల కోసం పేద విద్యార్థులు కాలేజీలో చేరితే వారికి మెస్ బిల్లులు రావడం లేదు. దీంతో భోజనం కోసం వారు నానా పాట్లు పడుతున్నారు. ఇటీవల ఒక రోజు భోజనం లేకపోవడంతో బయటకు వెళ్లి తినాల్సి వచ్చిందని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది నుంచి రూ.54 లక్షల మెస్ బిల్లులు పెండింగ్ ఉండడంతో కాలేజీ యాజమాన్యం సైతం ఏమీ చేయలేక చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం ట్యూషన్ ఫీజులు కూడా రూ.కోట్లకు పైగా బాకీ ఉన్నట్లు తెలిసింది.
పాత కేఎస్ఎం సముదాయంలో నిర్వహిస్తున్న ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి సింగరేణి సీఎస్ఆర్ నిధులే దిక్కవుతున్నాయి. సీఎం ప్రారంభించిన భవనంలోనే పరిపాలన బ్లాక్‌ను నిర్వహిస్తున్నారు. తర్వాత అదనపు తరగతి గదులు, హాస్టల్ గదుల కోసం రూ.కోటి సీఎస్ఆర్ నిధులను సింగరేణి మంజూరు చేసింది. గతంలో పనిచేసిన కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కూడా కలెక్టర్ కోటా నుంచి రహదారులు సహా ఇతర సౌకర్యాలకు నిధులు మంజూరు చేశారు. కానీ, కాంగ్రెస్ సర్కారు నుంచి మాత్రం నిధులు మంజూరు కాలేదు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆ కాలేజీకి సింగరేణే దిక్కవుతోంది. 310 ఎకరాల్లో ఉన్న కాలేజీ ఆవరణకు నేటికీ ప్రహారీ లేకపోవడం గమనార్హం. చాలాసార్లు కాలేజీ యాజమాన్యం వినతులు ఇస్తే చివరికి ఈ ఏడాది రూ 46 కోట్లు మంజూరు చేశారు.
ప్రతీ కాలేజీ హాస్టల్‌కు మెనూ చార్ట్ తప్పనిసరిగా ఉంటుంది. కానీ, ఈ కాలేజీలో మాత్రం అదిలేదు. ఎందుకంటే ఏ రోజు ఏ భోజనం పెడతారో తెలియదు. మెస్ బిల్లులు రాకపోవడంతో కాలేజీ యాజమాన్యం ఎక్కడ నుంచి తెచ్చి పెట్టాలని ఆలోచిస్తోంది. దీంతో రోజుకు ఒకసారి వెతుక్కోవాల్సి వస్తోంది. బయట కొనుక్కొని తినాల్సి వస్తోంది. అధ్యాపకుల కొరత బాగా ఉంది.
దేశంలోనే తొలి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని నిధుల లేమి వెంటాడుతోంది. యూజీసీ నిబంధనలు ప్రకారం ఫ్యాకల్టీ ఉండాలి. అదేస్థాయిలో తరగతి గదులు నిర్మించాలి. కానీ, అవేవీ లేవు. సరైన హాస్టళ్లు లేవు. బాత్రూములు మంచిగా లేవు. తినడానికి కూడా వరండా సరిపోవడం లేదు. విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
కొత్త యూనివర్సిటీకి తొలి విడతలో రూ.46 కోట్ల నిధులు ఇచ్చారు. కొత్త బ్లాక్ నిర్మాణం చేసుకోవాలి. సీఎస్ఆర్ నిధులు కూడా వచ్చాయి. కాలేజీ హాస్టల్ సముదాయం, మరమ్మతులు, ప్రహరీ నిర్మాణాలు వంటివి చేపడుతున్నాం. మెస్ బిల్లులు రావడం లేదు. అప్పు చేసి సరుకులు తెచ్చుకుంటున్నాం. మంచి కోర్సులు వచ్చాయి. విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. మెస్ బిల్లులు క్లియర్ అయితే సమస్య ఉండదు. కొత్త ఫ్యాకల్టీ కూడా 44 మంది వస్తారు.