కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికలవరం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నప్పటికీ మిత్రపక్షాల మద్దతు కూడగట్టేందుకు తెగ ఆరాట పడాల్సి వస్తున్నది. ఓవైపు తమను సంప్రదించకుండా అభ్యర్థులను ప్రకటించడంపై నల్లగొండకు చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులు అసంతృప్తితో ఉండగా, అటు వామపక్షాలు సహా టీజేఎస్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.
- అభ్యర్థుల ఎంపికపై మంత్రుల అలక.. మిత్రపక్షాల ఆగ్రహం
- రెడ్లకు రెండు స్థానాలు ఇవ్వడంపై బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి
- పీఆర్సీ, డీఏల జాప్యంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో వ్యతిరేకత
- పీఆర్టీయూ బరిలో ఉండటంపై అధికార పార్టీలో ఆందోళన
- పరస్పర సహకారం కోరుతున్న పీఆర్టీయూ, బీజేపీ !
- క్షేత్రస్థాయిలో పరిస్థితులతో కాంగ్రెస్ అభ్యర్థుల్లో అయోమయం
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నప్పటికీ మిత్రపక్షాల మద్దతు కూడగట్టేందుకు తెగ ఆరాట పడాల్సి వస్తున్నది. ఓవైపు తమను సంప్రదించకుండా అభ్యర్థులను ప్రకటించడంపై నల్లగొండకు చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులు అసంతృప్తితో ఉండగా, అటు వామపక్షాలు సహా టీజేఎస్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. అందుకు ఎన్నికల విషయంలో అంటీముట్టనట్టు ఉంటున్నారని సమాచారం. వీరి వ్యవహారం ఇలా ఉందంటే.. అసలు పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డికి క్షేత్రస్థాయిలో పెద్దగా పరిచయాలు లేకపోవడంతో ఆయన్ను ఎవరూ గుర్తుపట్టే పరిస్థితి లేదనే ప్రచారం ఉండగా, మరో అభ్యర్థి(వరంగల్-ఖమ్మం-నల్లగొండ) రాంరెడ్డి సర్వోత్తమరెడ్డి పోటీకే విముఖంగా ఉన్నారనే ప్రచారం కాంగ్రెస్ పార్టీని మరింత కలవర పెడుతున్నది. వీటికి తోడు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలూ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. తొలిసారి పీఆర్టీయూ స్వతంత్రం గా బరిలోకి దిగడం, ఆ అభ్యర్థికి బీజేపీ మద్దతుపై తర్జనభర్జనలు జరుగుతున్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో అసంతృప్తులను బుజ్జగించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తిప్పలు పడుతున్నట్టు తెలిసింది.
అభ్యర్థుల ఎంపిక పట్ల మంత్రుల అలక!
ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని ముందుగానే అభ్యర్థులను ప్రకటించడమే కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాటలు వేసిందనే ప్రచారం జరుగుతున్నది. ఖమ్మం-వరంగల్-నల్లగొండ స్థానానికి సర్వోత్తమ్‌రెడ్డిని ప్రకటించడంపై నల్లగొండ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు ఆ నియోజకవర్గంలోని వామపక్ష పార్టీలు ఆగ్రహంతో ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడి కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇక సామ రామ్మోహన్‌రెడ్డి ఎంపికపైనా వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల చేర్పు విషయంలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు సహకరించడం లేదని, అంతేగాక హైదరాబాద్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడం, ఉన్నత విద్యావంతులు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఉండటం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రచారానికి ఏర్పాట్లు చేసుకున్నా మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లాల్లో కీలక నేతలు సహకరించడం లేదనే అభిప్రాయం అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నది.
మిత్రపక్షాల్లో అసంతృప్తి..
అభ్యర్థుల ప్రకటన కాంగ్రెస్‌కు కొత్త సవాల్‌గా మారింది. మిత్రపక్షాలైన తెలంగాణ జన సమితి, వామపక్ష పార్టీలను సంప్రదించకుండానే ప్రకటించడం వారిలో అసంతృప్తి రాజేసింది. ఖమ్మం-వరంగల్-నల్గొండ స్థానంపై తెలంగాణ జన సమితి ఆశలు పెట్టుకోగా, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వామపక్ష పార్టీలకు ఉన్న రాజకీయ ప్రాధాన్యం కూడా కీలకంగా మారింది. మరోవైపు, సీపీఎం, సీపీఐ కలిసి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపే ఆలోచన చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మిత్రపక్షాల మద్దతు కీలకమని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం.. అసంతృప్తి మరింత పెరుగకుండా దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ స్వయంగా వారిని కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. వారి డిమాండ్లపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.
తొలిసారి బరిలో పీఆర్టీయూ..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారి ఉపాధ్యాయ యూనియన్ నుంచి అభ్యర్థి బరిలో దిగడం కాంగ్రెస్ పార్టీని మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. ఉపాధ్యాయ సంఘాల్లో పీఆర్టీయూ సభ్యుల సంఖ్య ఎక్కువ. ఒక్కో నియోజకవర్గంలో 20వేల మందికిపైగా ఉపాధ్యాయులున్నారు. వీరితో పాటు మరో 10వేల వరకు రిటైర్డ్ టీచర్లున్నారు. వీరి కుటుంబ సభ్యులతో కలిపి వేలల్లో ఓట్లు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో పీఆర్టీయూ అభ్యర్థి బరిలో ఉంటే తీవ్ర ప్రభావం చూపుతుందని అటు పార్టీ, ఇటు అభ్యర్థుల్లో టెన్షన్లో ఉన్నారు.
పీఆర్టీయూకు బీజేపీ మద్దతు ?
ఎన్నికల్లో తొలిసారి బరిలో నిలువాలని నిర్ణయించుకున్న పీఆర్టీయూ.. బీజేపీ మద్దతు కోరుతున్నదనే ప్రచారం కాంగ్రెస్ అభ్యర్థులను మరింత కుంగదీస్తున్నది. నల్లగొండ- ఖమ్మం-వరంగల్ నియోజకవర్గంలో పీఆర్టీయూ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్ పేరును ఖరారు చేయగా ఆయన బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకవేళ నల్లగొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గంలో బీజేపీ మద్దతిస్తే.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ సెగ్మెంట్లో బీజేపీకి పీఆర్టీయూ మద్దతిచ్చేందుకు ప్రతిపాదన చేసినట్టు ప్రచారంలో ఉన్నది.
ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు బరిలో ఉండే అవకాశాలున్నట్టు సమాచారం. అందుకే పరస్పర సహకారంపై ఇరువర్గాలు చర్చించుకుంటున్నారనే ప్రచారం కాంగ్రెస్‌ను మరింత గందరగోళానికి గురిచేస్తున్నది. సరైన ప్రణాళిక లేకుండా ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడమే కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పిదమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో మిత్రపక్షాలు వారి అభ్యర్థులకు మద్దతు ఇస్తాయా? ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాలు ఎలా స్పందిస్తాయి? అనేది ఆసక్తికరంగా మారింది. మిత్రపక్షాల మద్దతు, ఓట్ల సమీకరణే ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి.
బీసీలు, ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి
కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తున్నదనే అభిప్రాయం ఆ వర్గాల్లో తీవ్ర ఉన్నది. గత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో అగ్రవర్ణాలకే సీట్లు కేటాయించారని, మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించారనే అభిప్రాయం వారిలో బలంగా ఉన్నది. ఇప్పుడు మళ్లీ రెడ్లకే ఇవ్వడం వారిలో అసంతృప్తి నెలకొన్నది. కాంగ్రెస్‌పై కసితో బీసీ ఉద్యోగులు, విద్యావంతులు, నిరుద్యోగులు పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటంతో అభ్యర్థుల్లో ఓటమి భయం పట్టుకున్నది. ఇక ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. పెండింగ్ డీఏ, పీఆర్సీ అమల్లో జాప్యం చేస్తుండటంతో వారు ఎలా స్పందిస్తారోనని అభ్యర్థులు కలవరపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

