రామన్నపేట, డిసెంబర్ 26: తన ఇంటినే గ్రంథాలయంగా తీర్చిదిద్దిన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన మధుర కవి డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. ఆదివారం మన్‌కీ బాత్ కార్యక్రమంలో కూరెళ్ల విఠలాచార్య సామాజిక సేవలను ప్రస్తావించారు. కూరెళ్లకు బాల్యం నుంచి గ్రంథాలయాన్ని స్థాపించాలనే బలమైన కోరిక ఉండేదని, అప్పట్లో దేశానికి స్వాతంత్య్రం రాకపోవడంతో ఆ కల సాధ్యం కాలేదని పేర్కొన్నారు. కాలక్రమేణా విఠలాచార్య అధ్యాపకులు అయ్యారని, తెలుగు భాషను లోతుగా అధ్యయనం చేసి అనేక రచనలు చేశారని, ఏడేండ్ల క్రితం తన సొంత పుస్తకాలతో తన ఇంట్లో గ్రంథాలయం ప్రారంభించారని ప్రధాని కొనియాడారు.
కళలను నెరవేర్చుకోవడానికి వయస్సుతో సంబంధం లేకుండా 84 సంవత్సరాల వయస్సులో కూరెళ్ల తన కృషి పట్టుదలతో కల సాకారం చేసుకున్నారని ప్రశంసించారు. కూరెళ్ల స్ఫూర్తితో యువకులు గ్రంథాలయాల ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. తన ప్రయత్నాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించడం పూర్వజన్మ సుకృతమని డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య అన్నారు.