Sonu Nigam | ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోను నిగమ్ ప్రస్తుతం భాష వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక మ్యూజిక్ కన్సర్ట్‌లో సోన్ నిగమ్ కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని ఆరోపిస్తూ ఆయనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కన్నడ భాషకి చెందిన కర్ణాటక రక్షణ వేదిక (KRV) అనే సంస్థ ఈ ఫిర్యాదును అవలహళ్లి పోలీస్ స్టేషన్లో నమోదు చేసింది.
ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం, ఏప్రిల్ 25-26 తేదీల్లో ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జరిగిన ఒక మ్యూజికల్ కన్సర్ట్‌లో ఒక విద్యార్థి కన్నడ పాట పాడమని సోన్ నిగమ్‌ని కోరగా, సోను నిగమ్ స్పందిస్తూ “కన్నడ, కన్నడ, కన్నడ అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ఇలాంటి భావజలంతోనే కదా పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది అని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.
ఈ వ్యాఖ్యలు కన్నడ ప్రజలు మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని, కర్ణాటకలోని వివిధ భాషా సమూహాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కన్నడలో పాట పాడలని అడిగిన ఒక సాధారణ అభ్యర్థనను ఉగ్రవాద చర్యతో ముడిపెట్టడం ద్వారా సోను నిగమ్ కన్నడ సమాజాన్ని అవమానించారని, వారి సాంస్కృతిక గర్వాన్ని, భాషా గుర్తింపును హింస, అసహనంతో పోల్చారని ఫిర్యాదులో ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రక్షణ వేదిక సోను నిగమ్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 352(1) (వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 351(2) (నేరపూరిత పరువు నష్టం), మరియు 353 (మతపరమైన లేదా భాషాపరమైన మనోభావాలను దెబ్బతీయడం) కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
కాగా, బెంగళూరు పోలీసులు ఫిర్యాదును స్వీకరించినట్లు తెలిపారు, అయితే ఇంకా ఎటువంటి కేసు నమోదు చేయలేదు. ఈ ఆరోపణలపై సోను నిగమ్ ఇంకా బహిరంగంగా స్పందించలేదు. కన్నడ సంఘాలు సోను నిగమ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.