సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): నగరంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పబ్లిక్ టాయిలెట్లన్నంటినీ వినియోగంలోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులకు సూచించారు. మంగళవారం బుద్ధభవన్‌లో రెవెన్యూ, పారిశుధ్యం, టౌన్‌ప్లానింగ్, ఫైనాన్స్ విభాగాల అధికారులతో కమిషనర్ ఆయా విభాగాల అంశాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. జీహెచ్ఎంసీలో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదాయం పెంపునకు చేపట్టిన జీఏఎస్ సర్వేను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. నాలాల వరద నీరు నిలువకుండా ఫ్లోటింగ్ మెటీరియల్‌ను వెనువెంటనే తొలగించే విషయాలపై చర్చించారు. స్వచ్ఛ ఆటోలు నిర్దేశించిన ప్రకారంగా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, హేమంత్ కేశవ్ పాటిల్, అపూర్వ్ చౌహాన్, రవికిరణ్, ఉపేందర్ రెడ్డి, వెంకన్న, అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీశ్, గీత రాధిక, ట్యాక్స్ వాల్యుయేషన్ అధికారి మహేశ్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.
ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయండి
మియాపూర్: ఎస్ఆర్డీపీ కింద గచ్చిబౌలి కూడలిలో చేపడుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఆస్తుల సేకరణ సహా ఇతర ఏ ఇబ్బందులున్నా పరిష్కారానికి శీఘ్రంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి, ప్రాజెక్టు సీఈ దేవానంద్ సహా ఇతర అధికారులతో కలిసి ఆమె గచ్చిబౌలి ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం గుల్మొహర్ పార్కు, త్రిపుల్ ఐటీ కూడళ్లతో పాటు లింగంపల్లి ఆర్యూబీ, హెచ్ఎసీయూ బస్ డిపో ఎదుట మసీదు బండ ఫ్రీ లెప్ట్ ప్రాంతాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమ్రపాలి మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యల్లేకుండా ఫ్రీ లెఫ్ట్‌లను మరింతగా ఏర్పాటు చేయాలని, కూడళ్లను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. లింగంపల్లి ఆర్యూబీ వద్ద శాశ్వత పరిష్కారానికి గాను ఆర్వోబీ నిర్మాణానికి తగు ప్రతిపాదనలను రూపొందించాలని తెలిపారు. మసీదు బండ నుంచి గచ్చిబౌలి వరకు రహదారి విస్తరణకు ఆటంకంగా ఉన్న కోర్టు కేసులను త్వరిత గతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కీలకమైన కూడళ్లలో వాహనాల రాకపోకలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని కమిషనర్ ఆదేశించారు. ఈ పర్యటనలో డీసీ రజనీకాంత్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.