హైదరాబాద్, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రతిపాదిత ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల(టీఎస్ఎఫ్పీజెడ్) ఏర్పాటుకు త్వరలో మార్గదర్శకాలు వెలువడనున్నాయి. స్థానిక వ్యవసాయ ఉత్పత్తులకు అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కనీసం 500 ఎకరాల విస్తీర్ణంలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, జిల్లాలవారీగా కలెక్టర్లు భూములను గుర్తించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటునకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 1,496 దరఖాస్తులొచ్చాయి. వీటి పరిశీలన పూర్తిచేసిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఎక్కువగా నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం నుంచి దరఖాస్తులు వచ్చాయి. అత్యధికులు రైస్ మిల్లుల ఏర్పాటుకు ఆసక్తి చూపారు. మిర్చి, పసుపు, జొన్న, బిస్కెట్లు, చాక్లెట్లు, ఇతర పిల్లల తినుబండారాల పరిశ్రమలు, మాంసం, చేపలు, చికెన్ శుద్ధి పరిశ్రమలు, వంటనూనెలు, పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు తదితర ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు గోదాములు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయి.
దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకం కింద రూ. 10,900 కోట్లు కేటాయించింది. ఈ పథకం లో భాగంగా ఆహార పరిశ్రమలకు పెట్టుబడి వ్యయం కింద నిధులు మంజూరుచేస్తారు. ఈ పథకం ద్వారా రాష్ర్టానికి కనీసం రూ.500 కోట్ల వరకు నిధులు సమకూరే అవకాశం ఉన్నదని, వాటిని సాధించేందుకు కృషి చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు.