సూర్యాపేట, జనవరి 30 (నమస్తే తెలంగాణ): చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి దేశం కోసం ప్రాణాలర్పించిన సూర్యాపేట ఆర్యవైశ్య ముద్దుబిడ్డ, అమరుడు కల్నల్ సంతోష్‌బాబు తల్లి బిక్కుమళ్ల మంజులా ఉపేందర్ సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు 44వ వార్డుకు బీఆర్ఎస్ తరపున శుక్రవారం నామినేషన్ దాఖలుచేశారు. దేశ సేవకోసం ఆర్మీలో చేరి ప్రాణాలర్పించిన సంతోష్ సూర్యాపేటకు ఎంతో గర్వకారణమని, అలాంటి కుటుంబం నుంచి ఎన్నికల బరిలో నిలిస్తే ఏకగ్రీవం చేయాలని పలువురు ఆశిస్తున్నారు.
ఒకవేళ ఎన్నికలు జరిగినా గెలుపు ఖాయమని వ్యాఖ్యానిస్తున్నారు. నామినేషన్ అనంతరం మంజుల మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ఎనలేని అభివృద్ధి చేసిన కేసీఆర్ పాలనతీరు, బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మె ల్యే జగదీశ్‌రెడ్డి నాయకత్వంలో సూర్యాపేట లో జరిగిన అభివృద్ధిని ప్రజలు ఆస్వాదిస్తున్నారని పేర్కొన్నారు. తన కుమారుడు ఆర్మీలోకి వెళ్లి దేశం కోసం ప్రాణత్యాగం చేస్తే ..తాము ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో బరిలోకి దిగుతున్నామని వెల్లడించారు.