ఖైరతాబాద్, డిసెంబర్ 1: బీసీలపై దాడులకు ఉసిగొల్పుతూ, వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, ఆయన పార్టీ సభ్యత్వాన్ని రద్దుచేయాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ జనసభ, బీసీ, యాదవ సంఘాలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ 29న నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన బీసీ మహిళ మామిడి నాగలక్ష్మి సర్పంచ్‌గా నామినేషన్ వేస్తే సహించలేని మంత్రి కోమటిరెడ్డి.. ఆమె భర్త మామిడి యాదగిరి యాదవ్‌ను రౌడీషీటర్ సందీప్‌రెడ్డితో నకిరేకల్ వద్ద కిడ్నాప్ చేయించాడని ఆరోపించారు. కిడ్నాపర్లు రోజంతా ఆయనను కారులో తిప్పుతూ దట్టమైన అడవుల్లోకి తీసుకెళ్లి నగ్నంగా ఉంచి చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా మద్యంలో మూత్రం పోసి తాగించడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వ్యతిరేకంగా సర్పంచ్‌గా నామినేషన్ వేసే ధైర్యం మీకెక్కడిదంటూ కులం పేరుతో దూషిస్తూ కత్తులతో బెదిరిస్తూ హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు.
నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు కేసు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రౌడీషీటర్ సందీప్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మామిడి యాదగిరిపై దాడిని నిరసిస్తూ ఈ నెల 5న చలో ఎల్లమ్మగూడెం, 10న చలో గన్‌పార్క్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. తక్షణమే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని బీసీ సంఘాల జేఏ సీ అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశ్‌గౌడ్ హెచ్చరించారు. సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్, యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యదర్శి రమేశ్ యాద వ్, బీసీ కుల సంఘాల అధ్యక్షుడు కాటం న ర్సింహా యాదవ్, లొడంగి గోవర్ధన్ యా దవ్, బేరి రామచంద్రయ్య యాదవ్, కొమ్మనబోయిన సైదులు, వీరబోయిన లింగయ్య, కడారి రమేశ్, నూతక మధు, శ్రీధర్ , రమేశ్, బలిజ వినోద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.