పెద్దపల్లి, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ)/మంథని : ‘మేఘా’ అక్రమ తవ్వకాలపై అధికార యంత్రాంగం కదిలింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారంపేట శివారులోని అటవీ ప్రాంతం, రెవెన్యూ, ప్రభుత్వ భూముల్లోని కొండలు, గుట్టలు తవ్వకాలు, భారీ వృక్షాల కొట్టివేతతో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సృష్టించిన విధ్వంసంపై ‘రిజర్వు ఫారెస్టులో హైవే విధ్వంసం?’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో శనివారం ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పేరిట అనుమతులు ఒక చోట.. మట్టి పనులు మరోచోట, జరిమానాలు విధిస్తున్నా మారని తీరు, ఉల్లంఘనలపై ప్రచురితమైన కథనంపై పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష వెంటనే స్పందించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి సంబంధించి ఇచ్చిన అనుమతులు, జరుగుతున్న తవ్వకాలు, వచ్చిన ఆరోపణలపై వెంటనే సమగ్రంగా సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ, మైనింగ్, అటవీ శాఖలకు జాయింట్ సర్వే కోసం ఆదేశాలు జారీచేశారు. దీంతో రంగంలోకి దిగిన రామగిరి తహసీల్దార్ సుమన్, జిల్లా ఇన్చార్జి మైనింగ్ అధికారి జైసింగ్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ వినయ్ ఆదివారంపేట శివారులోని హన్మంతునిగుట్ట, పీర్ పహాడ్ గుట్టలను సందర్శించారు. క్షేత్ర స్థాయిలో జరిగిన అవకతవకలపై ఆరా తీశారు.
కలెక్టర్ జాయింట్ సర్వేకు ఆదేశించినప్పటికీ వివిధ విభాగాలకు చెందిన కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో జాయింట్ సర్వేకు వచ్చిన అధికారుల తీరు, క్షేత్రస్థాయిలో అనుసరించిన విధానంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు కలెక్టర్‌కు నికచ్చిగా నివేదిక సమర్పిస్తారా? లేదా?
అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి కొన్నాళ్లుగా ఇకడ అక్రమాలు జరుగుతున్నా ఆయా విభాగాలకు సంబంధించిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. లోతుగా చూస్తే కొందరు అధికారులకు ఈ అక్రమాల్లో భాగస్వామ్యం ఉన్నదన్న ఆరోపణలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో నివేదిక తయారు చేయాలని సంబంధిత అధికారులకు అప్పగించడంపై పలు విమర్శలు వస్తున్నాయి. అయితే, మేఘా సంస్థ తవ్వకాల్లో వాల్టా చట్టాన్ని ఉల్లంఘించిందని పేరొన్న కొందరు అధికారులు వారికి జరిమానా విధిస్తామంటూ ఓ నివేదికను కలెక్టర్‌కు ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఇదే సమయంలో మరికొన్ని విషయాల్లో ఏకంగా కలెక్టర్‌నే పకదారి పట్టించేలా వ్యూహరచన చేసినట్టుగా తెలుస్తున్నది. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించినట్టు పేరొంటున్న కొంతమంది అధికారులు మిగిలిన విషయాల్లో దొంగ ప్రమాణాలు పాటిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నిజాలు నిగ్గు తేలాలంటే మరి కొంతమంది ప్రత్యేకాధికారులను నియమించి సర్వే చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించారని చెప్తున్న అధికారులు మేఘాపై ఎటువంటి చర్యలు తీసుకుంటారన్న అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతున్నది.
సామాన్యుడు ఒక చెట్టు కొట్టేస్తేనే రకరకాల కేసులు పెడుతూ జరిమానాలు విధించే అధికారులు.. ఇప్పుడు వాల్టా చట్టం ఉల్లంఘించిన మేఘాకు గతంలో మాదిరిగానే తూతూ మంత్రంగానే జరిమానా విధించి చేతులు దులుపుకొంటారా? లేక చట్టపరంగా చర్యలు తీసుకుంటారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే సమయంలో ఏండ్ల చరిత్ర గల గుట్టలను తవ్విన అంశాలపై అధికార యంత్రాంగం నివేదిక సవ్యంగా ఇస్తుందా? లేదా? అన్నది మున్ముందు తేలే అవకాశం ఉన్నది. అలాగే, జాయింట్ సర్వేపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఈ అంశాలను మరింత నిశితంగా పరిశీలించడానికి ప్రత్యేక అధికారుల ద్వారా మరో మారు క్షేత్రస్థాయిలో సర్వే చేయిస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ పరిస్థితుల్లో కలెక్టర్ ప్రస్తుతం అధికారులు ఇచ్చే నివేదికలతోనే సరి పెడుతారా? లేదా ప్రత్యేక అధికారులతో సర్వే చేయిస్తారా? అనే విషయం తేలాల్సి ఉన్నది.