చలికాలం.. ఆరోగ్యానికి రోజుకో సవాల్ విసురుతుంది. ముఖ్యంగా, ఈ కాలంలో ‘కీళ్ల నొప్పుల సమస్య’ అధికం అవుతుంది. రక్తం గడ్డకట్టకున్నా.. ఈ చలికి శరీరం మాత్రం బిగుసుకుపోతుంది. నరాలు పట్టేసి.. నడవడం కూడా కష్టమైపోతుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ.. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా.. ‘కీళ్ల’ను కాపాడుకోవచ్చు. నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు.
చలి వాతావరణం.. శరీరంలో ఉండే సైనోవియల్ ద్రవంపై ప్రభావం చూపుతుంది. కీళ్లు, ఎముకల మధ్య లూబ్రికెంట్‌లా పనిచేసే ఈ జిగట ద్రవం గట్టిపడటం వల్ల.. కీళ్లు, ఎముకల్లో భరించలేని నొప్పి వస్తుంది. అంతేకాకుండా, ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు.. శరీరంలో రక్త ప్రసరణ నెమ్మదిగా సాగుతుంది. ఫలితంగా.. కీళ్లు గట్టిపడి, కండరాల నొప్పులకు కారణమవుతుంది.
రోజూ వ్యాయామం శరీరం బద్ధకిస్తే.. కీళ్ల నొప్పులు నెత్తికెక్కి కూర్చుంటాయి. అందుకే, నిత్యం తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఉదయాన్నే ఓ గంట నడక.. మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. శరీరం బిగుసుకుపోతే.. చిన్నచిన్న వార్మప్స్ చేస్తే సరి. యోగాసనాల ద్వారా శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా మార్చుకోవచ్చు. కొన్నిరకాల వర్కవుట్స్.. మీ కండరాల దృఢత్వాన్ని పెంచడంతోపాటు కీళ్ల నొప్పుల నుంచీ ఉపశమనం కలిగిస్తాయి.
నీళ్లు తగ్గొద్దు ఎండకాలంలోనే కాదు.. చలికాలంలోనూ డీహైడ్రేషన్‌తో డీలా పడిపోతుంటారు. ఈకాలంలో మీకు తెలియకుండానే.. నీరు తాగడం తగ్గించేస్తారు. దాంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురై.. కీళ్లలో నొప్పి పెరుగుతుంది. అందుకే, రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు కచ్చితంగా తాగాలి. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
‘డి’ లేకుంటే డీలానే.. చలి ప్రభావంతో చాలామంది ఇంటికే పరిమితం అవుతారు. బయట తిరగడానికి ఇబ్బంది పడతారు. ఫలితంగా, శరీరానికి తగినంత సూర్యరశ్మి తగలక.. విటమిన్-డి లోపానికి గురవుతారు. ఎముకల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించే విటమిన్- డి లోపిస్తే.. కీళ్ల నొప్పులు మరింత తీవ్రం అవుతాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. శరీరానికి నేరుగా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. విటమిన్-డి అధికంగా లభించే సాల్మన్ చేపలు, గుడ్డు పచ్చసొన, పాలు, పాల ఉత్పత్తులు, ఖర్జూరం, పుట్టగొడుగులు లాంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి.
వెచ్చ వెచ్చగా.. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం ద్వారా.. రక్త నాళాలు వ్యాకోచిస్తాయి. ఫలితంగా రక్త ప్రసరణ మెరుగుపడి, కండరాల నొప్పులు తగ్గుతాయి. ఇందుకోసం గోరువెచ్చని నీటితో స్నానం, హీటింగ్ ప్యాడ్స్, హీట్ ల్యాంప్స్ లాంటివాటిని ఆశ్రయించాలి. కీళ్లకు నేరుగా చలిగాలులు తగలకుండా.. స్వెటర్లు, చేతులకు గ్లౌవ్స్, కాళ్లకు సాక్స్లాంటివి వేసుకోవాలి.
ఆహారమే దివ్యౌషధం.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎన్ని చిట్కాలు పాటించినా.. సరైన ఆహారం తీసుకున్నప్పుడే కీళ్ల సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. చలికాలంలో కీళ్ల నొప్పులు తగ్గాలన్నా.. రోజంతా హుషారుగా గడపాలన్నా.. ఆహారంలో సల్ఫర్, కాల్షియం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ రెండిటినీ తగిన మోతాదులో శరీరానికి అందిస్తే.. ఎముకలు దృఢంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. క్యాబేజీ, బచ్చలికూర, సిట్రస్ జాతిపండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినాలి. ముఖ్యంగా, బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.