Cockroach Janta Party | సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన ఒక వ్యంగ్య రాజకీయ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కాన్వా (Canva) డిజైన్ల సహాయంతో రాత్రికి రాత్రే ఏర్పాటైన ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) కేవలం 76 గంటల్లోనే ఏకంగా 45 లక్షల (4.5 మిలియన్ల) పైగా ఫాలోవర్లతో దూసుకుపోతోంది. 30 ఏళ్ల పబ్లిక్ రిలేషన్స్ విద్యార్థి, మాజీ పొలిటికల్ సోషల్ మీడియా వాలంటీర్ అభిజీత్ దిప్కే ఈ వినూత్న డిజిటల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ పార్టీకి ఒక రాజ్యాంగం, ప్రత్యేక వెబ్సైట్, ఐదు సూత్రాల మేనిఫెస్టో కూడా ఉంచింది.
ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, ఉద్యోగాలు లేక సమాజంలో సరైన స్థానం దొరకని కొందరు యువకులు బొద్దింకల (కాక్రోచ్లు) లాగా తయారవుతున్నారని, వారు ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరిపై విమర్శలు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, అవినితీ, రుపాయి పతనం, ఇంధన ధరలు, పేపర్ లీకేజీల సమస్యలతో ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న యువతకు ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. వ్యవస్థ తమను బొద్దింకలుగా చూస్తే, ఆ బొద్దింకలన్నీ ఏకమైతే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ అభిజీత్ దిప్కే ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని స్థాపించాడు. దీంతో ఈ పార్టీని స్థాపించి సోషల్ మీడియాలో జాయిన్ అయితే కొద్ది గంటల్లోనే ఈ పార్టీకి విపరీతమైన మద్దతు లభించింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు, ఎక్స్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలలో ఈ పార్టీకి దూసుకుపోతుంది. అయితే, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, నకిలీ డిగ్రీలతో వ్యవస్థను తప్పుదోవ పట్టించే వారిని ఉద్దేశించి మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని సీజేఐ తర్వాత వివరణ ఇవ్వగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
మరోవైపు తమను తాము ‘సోమరులు మరియు నిరుద్యోగుల గొంతుక’గా ప్రకటించుకున్న ఈ పార్టీ, తమ నినాదాన్ని ‘సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ మరియు లేజీ (సోమరి)’ అని పిలుచుకుంటోంది. అలాగే ఈ పార్టీలో చేరడానికి వింతైన అర్హతలను కూడా పెట్టింది. ఇందులో చేరేవారు బలవంతంగా లేదా ఇష్టపూర్వకంగా నిరుద్యోగి అయి ఉండాలని, రోజుకు కనీసం 11 గంటల పాటు ఫోన్ లేదా ఇంటర్నెట్ వాడుతూ ఉండాలి, అలాగే నిత్యం సోషల్ మీడియాలో ప్రజా సమస్యలపై గళం విప్పే అలవాటు ఉండాలని తెలిపింది.
అలాగే వీరు విడుదల చేసిన ఐదు సూత్రాల మేనిఫెస్టో మాత్రం భారత రాజకీయ, వ్యవస్థాగత లోపాలపై తీవ్రంగా స్పందిస్తోంది. రిటైర్మెంట్ తర్వాత ఏ ప్రధాన న్యాయమూర్తికీ రాజ్యసభ సీటు ఇవ్వకూడదని, ఓటర్ల జాబితా నుండి అర్హులైన ఓట్లు తొలగిస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను ఉపా (UAPA) చట్టం కింద అరెస్ట్ చేయాలని, పార్లమెంటు మరియు క్యాబినెట్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ మేనిఫెస్టో డిమాండ్ చేస్తోంది. కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉన్న మీడియా లైసెన్సులను రద్దు చేసి స్వతంత్ర మీడియాకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఒక పార్టీ నుండి గెలిచి మరో పార్టీలోకి మారే ఎమ్మెల్యేలు లేదా ఎంపీలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కూడా పేర్కొంది. అలాగే ఈ పార్టీ ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని, ఎలాంటి రహస్య విరాళాలు తీసుకోబోమని స్పష్టం చేసింది.