న్యూఢిల్లీ: ఇటీవల వరుసగా రైళ్లలో జరుగుతున్న అగ్నిప్రమాదాల వెనుక కుట్ర ఉన్నదని రైల్వే తెలిపింది. రైళ్లలో మంటలు ప్రమాదవశాత్తు జరిగినవి కావని, సంఘ విద్రోహ శక్తులు ఉద్దేశపూర్వకంగా చేసిన విధ్వంసమని ఆరోపించింది. (Train Fires) రైళ్లలో జరిగిన పలు అగ్నిప్రమాద సంఘటనలపై క్షుణ్ణంగా విచారణ జరిపిన అనంతరం విధ్వంసానికి సంబంధించిన ఆధారాలు లభించాయని రైల్వే తెలిపింది. అనేక కేసులలో ‘అసాంఘిక శక్తుల’ ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొంది.
కాగా, రాజస్థాన్‌లోని అమరపుర, కోట, బెంగాల్‌లోని హౌరా, బీహార్‌లోని ససారం రైల్వే స్టేషన్లో జరిగిన నాలుగు సంఘటనలను రైల్వే ప్రస్తావించింది. రాజస్థాన్‌లోని అమరపురా స్టేషన్ సమీపంలో ఒక వ్యక్తి రైలు సీటు లినెన్‌కు నిప్పంటించడానికి ప్రయత్నించగా మంటలు వ్యాపించాయని రైల్వే తెలిపింది. కోటా ఘటనలో రాజధాని ఎక్స్‌ప్రెస్ బాత్రూం నుంచి మంటలు కనిపించాయని పేర్కొంది. హౌరా కేసులో కోచ్‌లోని బాత్రూం నుంచి పెట్రోల్‌తో తడిపిన వస్త్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే తెలిపింది. ససారం కేసులో గుర్తుతెలియని వ్యక్తి మండుతున్న వస్తువును ఖాళీ కోచ్ లోపలకు విసిరినట్లు ఆరోపించింది.
మరోవైపు సంఘ విద్రోహ శక్తుల చర్యలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రైల్వే తెలిపింది. ప్రతి ఘటనను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా వివరణాత్మక దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొంది. ప్రయాణికుల భద్రతకు కట్టుబడి ఉన్నామని రైల్వే పునరుద్ఘాటించింది. ప్రయాణికులు అప్రమత్తంగా, సురక్షితంగా ఉండాలని రైల్వే శాఖ కోరింది. ఏదైనా అనుమానాస్పద చర్యను గమనిస్తే వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ 139కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించింది.