ముంబై, సెప్టెంబర్ 12: కాలుష్యరహితంగా బొగ్గును రవాణా చేసేందుకు రూ.24,750 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు కోల్ ఇండియా ప్రకటించింది. వచ్చే ఐదేండ్లలో 61 ఫస్ట్ మైల్ కనెక్టివిటీ (ఎఫ్ఎంసీ) ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఈ మూలధన పెట్టుబడుల్ని ఉపయోగిస్తామని పేర్కొంది. 76.35 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యంతో మూడు దశలుగా ప్రాజెక్టుల్ని చేపడతామని ప్రపంచంలో అతిపెద్ద బొగ్గు ఉత్పాదక కంపెనీ అయిన కోల్ ఇండియా తెలిపింది. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నుంచి మెకానైజ్డ్ పైప్డ్ కన్వేయర్ల ద్వారా బొగ్గును రవాణా చేసి, నేరుగా రైల్వే వ్యాగన్లలో లోడ్ చేయడాన్ని ఎఫ్ఎంసీ ప్రాజెక్టుగా వ్యవహరిస్తారు. బొగ్గుగనుల ప్రాంతాలకు సమీపంలో నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాల్ని పెంపొందించడం కోసం ఎఫ్ఎంసీ ప్రాజెక్టులు అవసరమని కంపెనీ తెలిపింది.
వీటితో రోడ్డు ద్వారా బొగ్గు రవాణా ఉండదని, గాలిలో దుమ్ము కాలుష్యం, కార్గన్ ఉద్గారాలు తగ్గడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని కోల్ ఇండియా వివరించింది. మొదటి దశలో రూ.10,500 కోట్ల వ్యయంతో 35 ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 1.12 కోట్ల టన్నుల రవాణా సామర్థ్యంగల 8 ప్రాజెక్టులు పనిచేస్తున్నాయన్నది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో 17 ప్రాజెక్టులు పూర్తవుతాయన్నది. మిగిలిన 10 ప్రాజెక్టులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది.