హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : స్టాక్ ఎక్సేంజ్. ఎనర్జీ ఎక్సేంజ్. ఇప్పుడీ వరుసలో కొత్తగా కోల్ ఎక్సేంజ్ చేరనుంది. స్టాక్మార్కెట్లో వాటాలు కొన్నంత సులభంగా బొగ్గును సైతం కొనుగోలు చేసే రోజులు రాబోతున్నాయి. ఎక్కడ చౌకగా.. తక్కువకు బొగ్గు దొరికితే అక్కడి నుంచి కొనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్నది. దీనినే నేషనల్ కోల్ ఎక్సేంజ్‌గా పిలుస్తారు. దీని ద్వారా దేశంలో ఉత్పత్తి అయ్యే బొగ్గును ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. బొగ్గు ఉత్పత్తి, డిమాండ్‌ను బట్టి ధరలు పెంచడం, తగ్గించడం చేస్తుంటాయి.
కోల్ ఎక్సేంజ్, కొత్త విక్రయ విధానం సింగరేణి పాలిట శాపంగా మారునున్నదంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి బొగ్గు ధర అధికంగా ఉండగా, మహానది కోల్‌ఫీల్డ్స్‌లో తక్కువ ధరకే బొగ్గు లభిస్తున్నది. కోల్ ఎక్సేంజ్‌తో సింగరేణి బొగ్గు ధరలను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇది సంస్థ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు యాదాద్రి పవర్ ప్లాంట్‌కు జీ-9 గ్రేడ్ బొగ్గును సింగరేణి సరఫరా చేస్తున్నది. టన్ను బొగ్గు ధర రూ.4,200లుగా ఉంది. రవాణాకు రూ.800 అవుతున్నది. అదే మహానది కోల్‌ఫీల్డ్స్‌లో టన్ను బొగ్గు రూ.2,600కే లభిస్తున్నది.
బొగ్గును తక్కువ ధరకు విక్రయించి ఉత్పత్తి సంస్థలు నిలదొక్కుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. బొగ్గు గనుల పనితీరుపై సోమవారం ఆయన సమీక్షించారు. కోల్ ఎక్సేంజ్ ద్వారా బొగ్గు విక్రయ విధానాన్ని ప్రవేశపెట్టనున్నామని తెలిపారు.