యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 23 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్య విమానగోపురం స్వర్ణకాంతుల్లో ఆవిష్కృమైంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంకల్పం నెరవేరింది. గత ప్రభుత్వ హయాంలో సీఎం, మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల నుంచి సేకరించిన బంగారం విరాళంతోపాటు దేవస్థాన ఖజానాతో కొనుగోలు చేసిన 68 కేజీల బంగారంతో దివ్య విమానగోపురాన్ని స్వర్ణమయం చేశారు. దివ్య విమానగోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు హాజరై ఆవిష్కరించారు. ఉదయం 11.22 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో కలిసి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. కొండపైన ఉత్తర మాఢవీధుల్లో జరిగిన పంచకుండాత్మకమహా పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఉత్తర పంచతల రాజగోపురం నుంచి ఆలయంలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరంజా సహాయంతో దివ్య స్వర్ణ విమానగోపురం వద్దకు చేరుకున్నారు.
ఆలయ ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, వానమామలై మఠం 31వ పీఠాధిపతులు రామానుజ జీయర్ స్వామి సూచనలతో మహాకుంభాభిషేక ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయ ముఖ మండపంలో ప్రధానార్చకులు సీఎం దంపతులకు చతుర్వేద ఆశీర్వచనం చేయగా దేవదాయ ధర్మదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్ స్వామివారి ప్రసాదం, చిత్రపటం బహూకరించారు. సాయంత్రం దివ్య విమానగోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలను అర్చకులు పరిపూర్ణం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేలు, వేముల వీరేశం, నేనావత్ బాలూనాయక్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, శ్రీనివాసరాజు, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, కలెక్టర్ హనుమంతరావు, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, కమిటీ సభ్యులు మోహన్‌రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహ మూర్తి, ఈఓ భాస్కర్‌రావు, డీఈఓ దోర్బల భాస్కర్‌శర్మ, ఆలయ ప్రధానార్చకుడు కాండూరి వేంకటాచార్యులు, శోభారాణి, గోవిందహరి తదితరులు పాల్గొన్నారు.
దివ్య విమానగోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు నానా హంగామా చేశారు. విమాన గోపురంపైకి వెళ్లేందుకు పరిమిత సంఖ్యలో అనుమతినిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పైకి వెళ్లేందుకు సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదం చేశారు. పలువురు నాయకులు తిరుమాఢ వీధుల్లో చెప్పులతోనే సంచరించారు. చెప్పులు వేసుకునే ఆలయంలోకి ప్రవేశించారు.
దివ్య విమానగోపుర మహాకుంభాభిషేక మహోత్సవంలో ఒక స్తపతిని ఈఓ భాస్కర్‌రావు అవమాన పరిచారు. ‘మిమ్ముల్ని పిలువ లేదు.. నీవు రావొద్దు’ అంటూ వైటీడీఏ డిప్యూటీ స్తపతి మోతిలాల్‌ను ఈఓ అడ్డుకున్నాడు. దీంతో ఆ డిప్యూటీ స్తపతి అవమానంతో వెనుదిరిగాల్సి వచ్చింది. ఇది చూసిన అక్కడి పోలీసు సిబ్బంది, పత్రికా విలేకరులు, దేవాలయ సిబ్బంది ఆశ్చర్యపోయారు. సుమారు ఆరేండ్లపాటు శ్రమించి దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన స్తపతికి అవమానం జరుగడంపై పలువురి నుంచి విమర్శలు వచ్చాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రాన్ని మాసీ సీఎం కేసీఆర్ రూ. 1300 కోట్ల ప్రభుత్వ ఖజానాతో ఎంతో అద్భుతంగా పునర్నిర్మించారు. సుమారు 21 సార్లు యాదగిరిగుట్టకు వచ్చి స్వామివారి ఆలయాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించి లోటుపాట్లు లేకుండా నిర్మించాలని స్తపతులు, వైటీడీఏ అధికారులకు సూచించారు. ఈ క్రమంలో స్వామివారి దివ్య విమాన గోపురాన్ని స్వర్ణమయం చేయాలని సంకల్పించారు. ఈ గొప్ప కార్యాన్ని ప్రజలను భాగస్వామ్యం చేయాలని 2020 అక్టోబర్ 19న పిలుపునిచ్చారు. 2021, సెప్టెంబర్ 25 నుంచి ఆలయ అధికారులు బంగారం విరాళాలు సేకరించే పనిలో పడ్డారు. దాంతో పెద్ద ఎత్తున బంగారం విరాళాల రూపంలో, హుండీల ద్వారా వచ్చిన వాటితో స్వర్ణతాడపం పనులు పూర్తి చేశారు.