సంగారెడ్డి, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఈనెల 21న సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పర్యటనకు రానున్నారు. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.4,427 కోట్ల అంచనా వ్యయంతో ఈ రెండు ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం నిర్మించనున్నది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శనివారం ఆయన నారాయణఖేడ్ పట్టణాన్ని సందర్శించి.. ఎత్తిపోతలకు శంకుస్థాపన చేయనున్న స్థలాన్ని పరిశీలించారు.
బహిరంగ సభ స్థలం, వేదిక నిర్మాణ పనులు, హెలిపాడ్ ఏర్పాటు పనులు పరిశీలించి, కలెక్టర్ హన్మంతరావు, ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. జనసమీకరణకు సంబంధించి అన్ని సెగ్మెంట్ల ఇంచార్జీలు, ఎమ్మెల్యేలు, నాయకులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. మంత్రి వెంట ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.