చిక్కడపల్లి, జూన్ 25: గతంలో ఏ పార్టీ కూడా యాదవులను పట్టించు కోలేదని, యాదవులను అన్ని విధాలుగా ప్రోత్సహించి వారి ఆత్మ గౌరవాన్ని కాపాడింది సీఎం కేసీఆర్ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమవేశం న్విహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేంత వరకు యాదవులు పరిస్థితి దయనీయంగా ఉండేదని అన్నారు. కానీ, సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయన తరువాత యాదవులకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక అభివృద్ధికి చర్యలు తీసుకున్నారని తెలిపారు. గత ఎన్నికల్లో అన్ని పార్టీలకు యాదవులకు తగినన్ని ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. ఒక్క బీఆర్ఎస్ పార్టీ యాదవవులను గుర్తించిందన్నారు. గత ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి, ఒక రాజ్యసభకు అవకాశం కల్పించారని చెప్పారు. దీంతో 90 శాతం యాదవులంతా బీఆర్ఎస్కే మద్దతు తెలిపారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో కూడా సీఎం కేసీఆర్ యాదవులకు సముచిత స్థానం కల్పిస్తారనే పూర్తి నమ్మకం ఉందన్నారు. యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెలికాని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు యాదవులు, యాదవ ఉప కులాలకు 22 ఎమ్మెల్యే, 7 ఎమ్మెల్సీ, 5 ఎంపీ సీట్లు కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో ద్రవిడ దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు కృష్ణారావు, సినీనటి కరాటే కల్యాణి, యాదవ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణ యాదవ్, కోన గుర్వయ్య, చింతల రవీంద్రనాథ్, ఉడుతల రవీందర్, మన్మోహన్ యాదవ్, పోచబోయిన శ్రీహరి, రమేశ్ యాదవ్, మేకల రాములు యాదవ్, నోములు సైదులు, ఆవుల మంజులత, దాసరి శ్రీనివాస్, డాక్టర్ యాదిమెట్ల శ్రీనివాస్, రమేశ్ యాదవ్, మహేందర్ యాదవ్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.